ఉండవల్లి శ్రీదేవి.. నాలుగు నెలల మౌనం వీడినట్లేనా?
posted on Aug 12, 2023 @ 1:32PM
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రత్యక్షమయ్యారు. దాదాపు నాలుగు నెలల తర్వాత... అది కూడా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్ట్ సందర్శిస్తున్న సమయంలో ఆయనతో ఎమ్మెల్యే శ్రీదేవి భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... పార్టీ మార్పుపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని తెలిపారు. అలాగే చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో మాట్లాడిట్లు ఈ సందర్బంగా వెల్లడించారు. కానీ దాదాపు నాలుగు నెలల పాటు ఎవరికీ కనిపించకుండా ఉండడంతో.. ఉండవల్లి శ్రీదేవి ఏమయ్యారన్న ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకుంది.
ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క టీడీపీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధ బరిలో దిగారు. అయితే ఆమె అనూహ్యంగా గెలుపోందడంతో.. అధికార ఫ్యాన్ పార్టీ అధిష్టానం... అదే పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు... కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామ్‌నారాయణ రెడ్డి కాగా.. మరొకరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. సస్పెన్షన్ వేటు కొద్ది రోజులకు తెలుగుదేశం పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. అలాగే సదరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో క్రియాశీలంగా రాజకీయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
కానీ శ్రీదేవి మాత్రం తనపై సస్పెన్షన్ వేటు పడిన వెంటనే.. ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. ఆ క్రమంలో ఫ్యాన్ పార్టీ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేసి.. ఆ తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఎవరికీ కనిపించకుండా గాయబ్ అయిపోయారు.
మరోవైపు ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోందని.. ఉండవల్లి శ్రీదేవి మాత్రం ఎక్కడా కనిపించకుండా ఉన్నారనీ ఆమె నియోజకవర్గమైన తాడికొండలో ఓ సందేహమైతే వ్యక్తమవుతూ వస్తుంది. అలాంటి వేళ.. ఆగస్ట్ 10న ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్ట్ వద్ద ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి శ్రీదేవి దంపతులు రావడంతో.. ప్రజలకు ఓ క్లారిటీ అయితే వచ్చేసినట్లు అయింది. చంద్రబాబుతో భేటీ అనంతరం.. పార్టీ మార్పుపై త్వరలో ఓ క్లారిటీ ఇస్తానని ఆమె స్వయంగా ప్రకటించడంతో.. సైకిల్ పార్టీలో చేరతారనే ఓ ప్రచారం అయితే తాడికొండ నియోజకవర్గంలో ఊపందుకొంది.
ఓ వేళ ఆమె పసుపు పార్టీలో చేరితే.. ఆమెకు మళ్లీ తాడికొండ సీటే ఇస్తారా? లేకుంటే రాష్ట్రంలో మరో నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపుతారా? అదీఇదీ కాకుంటే.. సైకిల్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని.. పార్టీ అధికారంలోకి వస్తే.. కీలక పదవి ఇస్తామనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉందా? అనే ఓ ప్రచారం సైతం పోటిలికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.