విద్యుత్ బిల్లులపై నాడు ప్రవచనాలు.. నేడు బాదుడే బాదుడు!
posted on Aug 12, 2023 @ 3:39PM
అక్కల్లారా, అవ్వల్లారా.. మీ తమ్ముడు, మీ మనవడి ప్రభుత్వం వస్తుంది.. కరెంట్ బిల్లులు పూర్తిగా తగ్గిస్తా. చెల్లమ్మా వింటున్నావా.. ఆ దేవుని దయతో వచ్చేది మన ప్రభుత్వమే, తాతా వింటున్నావా.. మీ అందరి దీవెనలతో మీ మనవడి ప్రభుత్వం వస్తుంది. ఉప్పు పప్పు నుండి కరెంట్ బిల్లుల వరకూ అన్నీ ఫ్రీ ఫ్రీ. ఇదీ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఫ్యాన్ చేత పట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి చెప్పిన మాటలు. ఇక సీఎంగా జగన్ ప్రమాణస్వీకార వేదికపై కూడా ఇవే వల్లె వేసి చెప్పారు. కరెంట్ బిల్లుల విషయంలో విద్యుత్ ఒప్పందాలను సమీక్షించి, విద్యుత్ చార్జీలను పూర్తిగా తగ్గిస్తానని చెప్పారు. ఈ ప్రమాణస్వీకారంలో తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో జగన్ ఈ ప్రకటన చేశారు. దీంతో ప్రజలు జగన్ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. మాట తప్పడు.. మడమ తిప్పడు అనుకున్న జగన్.. బిల్లులు తగ్గించడం దేవుడెరుగు ఏడాది తిరిగేసరికి ఆ బిల్లులను రెట్టింపు చేయడం మొదలు పెట్టి మడమ తిప్పడమే కాదు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కి వెన్ను చూపారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా బాదుడే బాదుడు కనిపిస్తున్నది. ఎన్నికలకు ముందు గల్లీ గల్లీ తిరిగి చెప్పిన ఆ అవ్వా తాతా ఎటుపోయారో.. మాట ఇచ్చిన అక్క చెల్లెళ్ళను ఏం చేశారో కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో నిత్యావసర ధరలు చూస్తే కొండెక్కి కూర్చున్నాయి. విద్యుత్ బిల్లులు ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయి. రేషన్ డోర్ డెలివరీ అని కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి బళ్ళు, వాటిలో ఇద్దరు మనుషులను పెట్టిన సంగతి తెలిసిందే. పావలా కోడికి ముప్పావలా మసాలా పెట్టినట్లు ఈ డోర్ డెలివరీ రేషన్ రాలేదు.. అంతకు ముందు రేషన్ లో వచ్చే సరుకులు రావట్లేదు.
ఇక కరెంట్ బిల్లుల విషయానికి వస్తే నెలనెలా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులతో పోలిస్తే.. జగన్ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు వంద శాతం పైనే పెంచుకుంటూ వచ్చారు. పైగా ఈ ఏడాదిలో ఇది 200 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంతకు ముందు రెండు నెలలకి ఒకసారి రూ.200 బిల్లులు వచ్చేవారికి ఇప్పుడు నెలకి రూ.400 వరకూ వచ్చి నడ్డి విరుగుతోంది. రెండు నెలలకి ఒకసారి బిల్లులు ఇస్తే ఈ మొత్తం భారీగా కనిపిస్తుందనే నెల నెలకి రీడింగ్ తీసి బిల్లులు చేతిలో పెడుతున్నారు. పైగా ఈ బిల్లులకు తోడు సర్ చార్జీలనీ, సర్దుబాటు చార్జీలనీ, అదనపు చార్జీలనీ, ట్రూ అప్ చార్జీలనీ, పవర్ పర్చేజ్ చార్జీలనీ ఎలా కావాలంటే అలా కలుపుకొని ప్రజల నడ్డి విరుస్తున్నారు.
తొలిసారి బిల్లులు పెంచే సమయంలో ప్రభుత్వం తక్కువ విద్యుత్ ను వినియోగించే వారిపై ఎలాంటి భారం పడదని చెప్పింది. కానీ మూడేళ్ళలో శ్లాబ్ ల వారీగా భారీగా ధరలు పెంచేసి జనాన్ని పిండేశారు. ఇదేంటని అధికారులను ప్రశ్నించినా.. వినియోగించిన విద్యుత్ కు సంబంధించిన శ్లాబ్ ల వారీగా పెరిగిన బిల్లులే వేశాం.. కట్టి తీరాల్సిందేనని సమాధానాలు వస్తున్నాయి. గత మూడేళ్ళలో ఐదు సార్లు విద్యుత్ బిల్లులు పెంచగా.. తాజాగా ఈ ఏడాది మే నెలలో కూడా మరోసారి భారం వేశారు. ఇంధన సర్దుబాటు పేరిట యూనిట్ కు 40 పైసల వంతున మే నెల నుండి బిల్లుతో కలిపి డిస్కంలు వసూలు చేస్తున్నాయి.
ఈ వసూళ్లు ఒక్కో స్లాబ్ లో ఒక్కోలా పెరుగుతూ పోతూ ఉండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. సుమారు రూ.600 విద్యుత్ బిల్లయితే మరో రూ.500 చార్జీలను కలిపి ప్రజలపై భారం మోపుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఎంతలా బాదేస్తుందో చూడండి అంటూ ప్రజలు తమ విద్యుత్ బిల్లులను సోషల్ మీడియాలో పెడుతూ బాదుడే బాదుడు అంటూ జగన్ మీద ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల బిల్లుల మోతకు ప్రభుత్వం చార్జీలు తోడై వినియోగదారులు కుదేలౌతున్నారు. కరెంటు బిల్లంటేనే షాక్ కొట్టినట్లు కొయ్యబారిపోతున్నారు. ఏపీ ప్రజలకు విద్యుత్ బాదుడు ను జగన్ సర్కార్ ఐదు రకాలుగా బాదేస్తోంద. ఫిక్సెడ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, విద్యుత్ డ్యూటీ, ట్రూఆప్ చార్జీలు (1136), ఇంధన సర్దుబాటు (ఎఫ్ పీపిసీఏ చార్జీలు (52021), ఇంధన సర్దుబాటు (ఎఫ్ పిపి సిఏ చార్జీలు) (42023) ఇందులో ఫిక్స్ డ్ చార్జీలు అంటే మన ఇంటికి కరెంటు రావటానికి లైన్లు, సబ్ స్టేషన్లు , ట్రాన్స్ ఫార్మర్లు వగైరా వేయాలి. వాటికి చేసిన ఖర్చును వసూలు చేయడాన్ని ఫిక్స్‌డ్ చార్జీలు అంటారు. మన ఇంటికి కనెక్షన్ తీసుకునేటప్పుడు 2 కేవీ, 4 కేవి, 5 కేవి అలా మన అవసరాన్ని బట్టి తీసుకుంటాము. ఒక కేవి కి రు.10లు చొప్పున ఎన్ని కేవీ లోడు ఉంటే అన్ని 10లు వసూలు చేస్తున్నారు. ఇవి ఎల్లప్పుడూ కొనసాగుతాయి.
కరెంటు లైన్లు వేసి ఎప్పుడో 30 ఏళ్లకు పైగా అయిన ప్రాంతాలలో కూడా ఇప్పుడు ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు. అలాగే కస్టమర్ చార్జీలు అంటే మన ఇంటికి కరెంటు సప్లై చేసినందుకు వేసే చార్జీలు. ఇవి మనం నెలలో వాడుకునే యూనిట్ల శ్లాబును బట్టి రు25,రు.30,రు.45,రు.50,రు.55లు గా ఉన్నది. ఇక విద్యుత్ డ్యూటీ అంటే మనం విద్యుత్ వాడుకున్నందుకు ప్రభుత్వానికి కట్టే పన్ను. ఇది యూనిట్ కు 6 పైసలు వసూలు చేస్తున్నారు. షాపులకు అయితే యూనిట్‌కు 1 రూపాయి వసూలు చేస్తున్నారు. ట్రూ అప్ చార్జీలు అంటే 2014 నుండి 2019 వరకు వాడిన విద్యుత్ పై రు.3,013 కోట్ల రూపాయలు ప్రజలనుండి 36 నెలలో వసూలు చేయబోతున్నారు. అవే మనకు బిల్లులో True-Up Charges (11/36) పేరుతో ఉన్నాయి. ఆనాడు అంటే 2014 నుండి 2019 వరకు మనం వాడిన యూనిట్లకు యూనిట్ కు 0.22 పైసల చొప్పున వసూలు చేస్తున్నారు. వీటిని ఆగస్టు 2022 నుండి జులై 2025 వరకు వసూలు చేస్తారు.
ఆతర్వాత 2019 నుండి 2021 వరకు వసూలు చేస్తారు. ఇక ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges) అంటే 2021-2022 ఆర్థిక సంవత్సరానికి వాడిన కరెంటుకు ఇప్పుడు వసూలు చేస్తున్నారు. అవే మనకు ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో (FPPCA charges (5/2021) బిల్లులో ఉన్నాయి. ఆనాడు మనం వాడిన కరెంటుకు యూనిట్‌కు ఏప్రిల్ నుండి జూన్ వరకు 0.20 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. జులై నుండి సెప్టెంబరు వరకు యూనిట్‌కు 0.63 పైసలు, అక్టోబర్ నుండి డిశంబరు వరకు యూనిట్‌కు 0.57 పైసలు, జనవరి నుండి మార్చివరకు యూనిట్‌కు 0.66 పైసలు చొప్పున వసూలు చేస్తారు. ఈ వసూళ్ళు అయిన అనంతరం 2022-2023 ఆర్థిక సంవత్సరానికి తర్వాత వసూలు చేస్తారు. ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges) అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సం అంటే 2023-2024 లో వాడిన కరెంటుకు ఇప్పుడు వసూలు చేస్తున్నారు. అవే మనకు ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges (4/2023 )) పేరుతో బిల్లులో ఉన్నాయి. ఇవి ఇక మీదట ప్రతి నెలా కొన సాగుతాయి.