కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య చిచ్చుపెట్టిన పవర్ ప్లాంటు
posted on Apr 18, 2012 @ 11:25AM
విజయనగరంజిల్లా కొమరాడ మండలం కోటిపామ్ వద్ద ఏర్పాటు చేయాలనుకుంటున్న థర్మల్ పవర్ ప్లాంట్ ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలకు కారణమైంది. ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటును స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే స్థానిక ప్రజల అభీష్టానికి అనుగుణంగా కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ మాట్లాడుతుండగా, అందుకు భిన్నంగా రాష్ట్రమంత్రి శత్రుచర్ల విజయరామరాజు మాట్లాడుతున్నారు. ఈ పవర్ ప్లాంట్ విషయమై ఇద్దరూ పరస్పరం విభేదించుకుంటున్నారు. విరుద్ధ ప్రకటనలు ప్రకటిస్తున్నారు. తన కంఠంలో ప్రాణం ఉండగా థర్మల్ కేంద్రం ఏర్పాటు జరగదని కిశోర్ చంద్రదేవ్ అంటున్నారు.
అయితే ఈ ప్లాంటు వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగు తుందనీ, స్థానికులకు ఉపాథి లభిస్తుందనీ, అందువల్ల దీనికి అడ్డుపడవద్దని శత్రుచర్ల అంటున్నారు. ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తే 25 కిలోమీటర్ల పరిథిలో వాతావరణం కలుషితం అవుతుందని, పరిసర ప్రాంతాల్లో తాగునీరు కూడా లభించదని భూగర్భజలాలు కూడా అడుగంటుతాయని ప్రజాసంఘాల ప్రతినిథులు హెచ్చరించారు. ఈ ప్లాంటు విషయంలో కేంద్ర, రాష్ట్రమంత్రులు డ్రామాలు ఆడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. తనకు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని ప్రజల పక్షాన ఉన్నందువల్లే తనను ప్రజలు ప్రతిసారి ఆదరిస్తున్నారని కిశోర్ చంద్రదేవ్ అంటున్నారు.