డిఎస్పీ నళినిని నట్టేట ముంచిన టి.ఆర్.ఎస్.
posted on Apr 18, 2012 @ 11:28AM
తెలంగాణా ప్రాంతంలో డిఎస్పీగా పనిచేస్తూ హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలోకి దిగిన నళినిని తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్.) నట్టేట ముంచింది. నళిని వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడుఆమెను టి.ఆర్.ఎస్. అధినేత చంద్రశేఖరరావు గొంతెత్తి కీర్తించారు, ఘనంగా సత్కరించారు. అయితే ఇప్పుడు ఆమె పరకాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరితే ఆయన 'జాంతానై' అంటున్నారు. దీంతో ఆమె అయోమయంలో పడ్డారు. టి.ఆర్.ఎస్. మద్ధతిస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. పోటీ చేస్తే తనకు విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయని ఆమె భావించారు.
కానీ, టి.ఆర్.ఎస్. మాత్రం ఆమెకు మద్దతు ఇవ్వడానికీ నిరాకరించింది. అయితే పరకాలలో నళిని పోటీ చేస్తే తెలంగానా తెలుగుదేశం ఫోరం ఆమెకు మద్దతు ఇస్తుందని ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటించారు. ఏదేమైనా నళిని ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగితే పరకాల ఎన్నికల వాతావరణంలో మార్పు కనిపించటం ఖాయం. ఈమెతో పాటు తెలంగాణావాదాన్ని భుజాన వేసుకున్న టి.ఆర్.ఎస్., బిజెపి అభ్యర్థులు కూడా రంగంలో ఉంటే తెలంగాణావాద ఓట్లలో చీలిక సంభవించి చివరికి అది తాజా మాజీ కొండా సురేఖకు లాభించవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.