నెల్లూరు లోక్ సభ దేశం అభ్యర్థికి ఇక్కట్లు
posted on Apr 18, 2012 @ 11:23AM
నెల్లూరు లోక్ సభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వంటేరు వేణుగోపాలరెడ్డి పలు సమస్యల తో సతమతమవుతున్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో తెలుగు దేశంపార్టీ తరపున పోటీకి ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో వంటేరు వేణుగోపాలరెడ్డిని ఒప్పించి బరిలోకి దింపారు. అప్పటినుంచి ఆయనకు ఇబ్బందులు ప్రారంభ మయ్యాయి. ఈ లోక్ సభ నియోజకవర్గం పరిథిలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లో టిడిపికి అసలు నాయకత్వం లేకపోవటం వేణుగోపాలరెడ్డికి తీవ్రకలవరాన్ని కలిగిస్తోంది. మూడు నియోజకవర్గాల్లో వెంటనే ఇన్ ఛార్జిలను ఎవరినైనా నియమిస్తే కొత్త సమస్యలు ఎదురవుతాయనే భయంతోనే పార్టీ అధిష్టానం ఇప్పటివరకూ ఆ అంశం జోలికి పోలేదు. అదే ఇప్పుడు వేణుగోపాలరెడ్డికి శాపంగా మారింది. కొన్ని గ్రామాల్లో పార్టీకి అసలు ఒక్క కార్యకర్త కూడా లేడని అక్కడ తెలుగుదేశంపార్టీ జెండాలు కట్టేవారు కరువయ్యారని వేణుగోపాలరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎంపి టి.సుబ్బిరామిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. సుబ్బిరామిరెడ్డి రంగలో ఉంటే ఎన్నికల ఖర్చు కూడా బాగా పెరగడం ఖాయం. దీంతో వేణుగోపాలరెడ్డిపై ఒత్తిడి మరింత పెరిగింది.