డమ్మీ గన్ తో బెదరించి..గొడ్డలితో దాడి చేసి బంగారం దోపిడీ!
posted on Jan 3, 2026 @ 1:35PM
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రాంతంలో ఓ జ్యువెలరీ షాప్ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఇద్దరు దుండగులు డమ్మీ గన్‌తో బెదిరించి, షాప్ యజమానిపై గొడ్డలితో దాడి చేసి నాలుగు తులల బంగారం దోచుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన షాప్ యజమాని సందీప్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
రాంపల్లి, ఘట్‌కేసర్ ప్రధాన రహదారిపై సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్ షాప్‌కు శుక్రవారం సాయంత్రం సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్లలా వచ్చారు. సాధారణ కొను గోలుదారుల మాదిరిగా షాప్‌లోకి ప్రవేశించిన వారు. కొద్దిసేపటికి ఒక్కసారిగా తమ వద్ద ఉన్న టాయ్ గన్ తో షాప్ యజమాని సందీప్ కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. అనంతరం షాప్‌లో ఉన్న బంగారు బాక్స్‌లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు.
పరిస్థితిని గమనించిన సందీప్ ధైర్యంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులలో ఒకడు తన వద్ద ఉన్న గొడ్డలి లాంటి పదునైన ఆయుధంతో సందీప్ తలపై బలంగా దాడి చేశాడు. ఒక్కసారిగా జరిగిన దాడిలో సందీప్ తీవ్రంగా గాయపడి రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగులు నాలుగు తులల బంగారాన్ని తీసుకుని పరారయ్యారు. ఓనర్ తీవ్రంగా ప్రతిఘటిం చడంతో వారు ఉపయో గించిన డమ్మీ గన్‌ను అక్కడే వదిలేసి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.అరుపులు, గట్టి గట్టిగా కేకలు వినిపించడంతో స్థానికులు లోపలికి వచ్చి చూడగా.. సందీప్ రక్తం మడుగులో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సందీప్‌ను తక్షణమే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
కాగా దోపిడీ జరిగిన షాప్ పరిసరాలను, దుండగులు ప్రవేశించిన మార్గాలను పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు వదిలేసిన డమ్మీ గన్‌తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. షాప్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు. దుండగుల్ని పట్టుకునేందుకు ఎస్‌వోటీతో పాటు స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ దోపిడీ ఘటనతో నాగారం, కీసర పరిధిలోని వ్యాపార వర్గాలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. ముఖ్యంగా జ్యువెలరీ షాప్‌ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే ఇలాంటి ఘటన జరగడం కలవరపెడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.