దిగ్విజయ్ జోస్యం..యూపీ పీఠం మాదే!
posted on Jan 31, 2012 8:46AM
భోపాల్: ఉత్తరప్రదేశ్ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చితీరుతుందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ జోస్యం చెప్పారు. యుపిలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే పోటీ జరుగుతోందని సోమవారం అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బహుజన సమాజ్‌వాదీ పార్టీకి అంతసీన్ లేదని, బిజెపి కూడా నామమాత్రంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీతో జరుగుతున్న ముఖాముఖి పోటీలో కాంగ్రెస్ విజయం ఖాయమని దిగ్విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలే తప్ప మిగతా రాజకీయ పక్షాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదని ఆయన చెప్పారు. భోపాల్‌లోని పాత విధాన సభ వద్ద జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన దిగ్విజయ్ మీడియాతో ముచ్చటించారు. అత్యాచార బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ బాధితులు ఎవరనేది నిర్థారించాల్సింది అత్యున్నత న్యాయస్థానమని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగానే నడచుకోవాలని వ్యాఖ్యానించారు. ఇండోర్ మీదుగా ఇక్కడకు చేరుకున్న దిగ్విజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నిమిత్తం యుపి వెళ్తున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాంతీలాల్ భూరియా, ప్రతిపక్ష నేత అజయ్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. కేంద్రంలోని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రకటనను ఒక డ్రామాగా కొట్టిపారేశారు. ప్రధాన సమస్యలపై ప్రజలను పక్కదారి పట్టించడానికే ఆయనీ వ్యాఖ్యలు చేస్తున్నారని దిగ్విజయ్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి ప్రభుత్వం అవినీతిలో పీకలోతుకూరుకుపోయిందని ఆరోపించారు. ఎన్నికల్లో బిఎస్‌పికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.