ఒక్కటైన సిఎం ,డిప్యూటీ సిఎం
posted on Jan 31, 2012 8:35AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చేతులు కలిపారు. గత కొద్ది కాలంగా వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ స్థితిలో వారిద్దరి మధ్య సచివాలయంలో జరిగిన భేటీ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. తాజా రాజకీయ అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటుపై, ఉప ఎన్నికలపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. తాను ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చేసినట్లు వచ్చిన వార్తలపై దామోదర రాజనర్సింహ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది.ఈ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏని 5.99 శాతం పెంచడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లాలో డిఆర్‌డిఏకు 11 ఎకరాలు, అనంతపురం జిల్లాలో బిడిఎల్ కంపెనీకి 44 ఎకరాలు, నెల్లూరులో శిల్పారామం ఏర్పాటుకు 7 ఎకరాలు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.నెల్లూరులో శిల్పారామం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యాట్ పెంపు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంపై కూడా సమావేశంలో చర్చించారు. శాసనసభ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఈ స్థితిలో వ్యాట్‌పై నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు.