గాంధేయవాదులమని..బ్రాందీవాదులుగా: బాబు
posted on Jan 31, 2012 8:55AM
హైదరాబాద్: గాంధేయవాదులమని చెప్పుకునే కాంగ్రెసు వారు బ్రాందీవాదులుగా మారిపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సాయంత్రం సికింద్రబాదులోని ప్యారడైజ్ సెంటర్ నుంచి గాంధీ విగ్రహం వరకు మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఆయన ప్రసంగించారు.ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై అయన తీవ్ర విమర్శలు చేశారు. సారా వ్యాపారి ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని ఆయన బొత్సను ఉద్దేశించి అన్నారు. అంబెద్కర్ విగ్రహాలను తాగిన మత్తులో కూలదోశామని నిందితులు అంటున్నారని, రాష్ట్రాన్ని కాంగ్రెసు ప్రభుత్వం మైకంలో ముంచెత్తుతోందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేదని, మద్యం ఏరులుగా పారిస్తోందని ఆయన అన్నారు. బొత్స సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తనకు 31 మద్యం దుకాణాలు ఉన్నాయని బొత్స సత్యనారాయణ స్వయంగా చెప్పుకున్నారని, అన్ని దుకాణాలు బొత్సకు ఎలా వచ్చాయని ఆయన అన్నారు. ఒక్క వ్యక్తి ఒకే దుకాణం పాడుకోవడానికి వీలుంటుందని, అటువంటి స్థితిలో బొత్స 31 దుకాణాలను ఎలా సొంతం చేసుకున్నారని ఆయన అన్నారు.