యూపీ ఎన్నికల్లో ప్రచారం చేయను: మోడీ
posted on Jan 31, 2012 @ 9:40AM
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రసక్తే లేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది.నరేంద్ర మోడీ తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక కారణాలు లేకపోలేదు. తనకు బద్ధవిరోధి అయిన సంజయ్ జోషిని ఈ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఇన్‌ఛార్జిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు గడ్కారీ తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణంగా ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టక ముందు మోడీ ప్రధాన కార్యదర్శి హోదాలో కేంద్ర కార్యాలయంలో ఉండేవారు.అప్పటి నుంచి వారి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇవి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింతగా పెరిగాయి. సంఘీయుడైన జోషి కొంతకాలం పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అయితే గడ్కారీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తటస్తులను, మాజీలను ఆహ్వానించారు. అందులో భాగంగానే సంజయ్ జోషీకి యూపీ ప్రచార బాధ్యతలను అప్పగించారు.