జైలేమైనా కొత్తా.. జైలుకెళ్లు! జగన్ పై ఉండవల్లి సంచలనం
posted on Apr 4, 2021 @ 7:21PM
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో దుమారం రేపుతూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొంత ఉధృతి తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ ఉద్యమం ఊపందుకుంటోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సీఎం జగన్‌ను ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకెళ్లడం కొత్తా.. జైలుకెళ్లు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నాయన్నారు ఉండవల్లి. అవినీతి కారణంగానే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర పెద్దలు పోరాడలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోందన్నారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఎందుకు భయపడాలి అని ఉండవల్లి ప్రశ్నించారు.
‘‘పోతే జైలుకే పోతారు. జైలేమైనా కొత్తా నీకు... జైలుకెళ్లు. దేనికి భయపడడం. ఇప్పుడు జరుగుతోంది.. సోషలిజం వర్సెస్ క్యాప్టలిజం. మీరు నాయకత్వం తీసుకోండి. ఇవాళ మీరు గనుక వెనకడుగు వేస్తే... అది మీ తప్పుగానే జనం భావిస్తారు. ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చిన రాష్ట్ర ప్రజల వెంట నిలబడతారా... లేదా మోదీ, అమిత్ షాల మాటలు వింటారా అన్నది తేల్చుకోండి. జగన్ రెడ్డి తిరగడబడతాడనే జనం అనుకుంటున్నారు. రండి జగన్.. పార్లమెంట్ వేదికగా పోరాడండి. 51 శాతం ఓట్లు, 151 సీట్లు ఏ రాష్ట్రంలోనూ రాలేదు. భయపడటం వైఎస్ఆర్ కొడుకు చేయాల్సినది కాదు. విశాఖలో సెమినార్ పెట్టండి... వైజాగ్ డిక్లరేషన్ ఇద్దాం’’ అని ఉండవల్లి పిలుపునిచ్చారు.