బీజాపూర్ లో అసలేం జరిగింది! మావోయిస్టుల ప్లాన్ ఏంటీ?
posted on Apr 4, 2021 @ 8:03PM
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ సంచలనంగా మారింది. మావోయిస్టుల పంజాకి 24 మంది భద్రతాబలగాలు బలి కావడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఎన్ కౌంటర్ లో చనిపోయిన జవాన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 24 మంది జవాన్లు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో 19 మంది జవాన్ల మృతదేహాలను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో 16 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఎన్ కౌంటర్ ఘటనలో మొత్తం 21 మంది సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏడుగురు సీఆర్పీఎఫ్‌కు చెందిన వారున్నారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరంగా కొనసాగుతోందని నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్స్ బృందం డీజీ అశోక్ జునేజా వెల్లడించారు.
అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన భద్రతా దళాలకు మావోయిస్టుల దాడిలో అత్యధిక నష్టం వాటిల్లడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు 24 మంది జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, గల్లంతైన జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంపై గట్టి పట్టున్న మావోయిస్టులు ఓ పద్ధతి ప్రకారం భద్రతా బలగాలపై దాడి చేశారు. కూంబింగ్ ఆపరేషన్ లో ఉన్న భద్రతా బలగాలు తామున్న ప్రాంతానికి వస్తాయని ముందే ఊహించిన మావోయిస్టులు.. అందుకు తగిన విధంగా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.
400 మందితో కూడిన భద్రతాబలగాల కూంబింగ్ బృందం తరెం ఏరియాలో ప్రవేశించింది. అయితే తమకు అనువుగా ఉండే ప్రాంతంలోకి భద్రతాబలగాలు వచ్చే దాకా వేచిచూసిన నక్సల్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దాదాపు 600 మంది నక్సల్స్ 'యు' ఆకారంలో మోహరించి ఏకే-47 తుపాకులు, రాకెట్ లాంచర్లు, ఐఈడీ పేలుడు పదార్థాలతో విరుచుకుపడ్డారు. ఈ తరహా మోహరింపునే 'అంబ్రెల్లా ఫార్మేషన్' అంటారు.
మావోయిస్టుల వ్యూహం గురించి భద్రతా బలగాలు పసిగట్టే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూడు వైపుల నుంచి దాడి జరగడంతో భద్రతా బలగాలు స్పందించడానికి తగిన సమయం చిక్కలేదు. ఏ దిశగా కాల్పులు జరపాలని నిర్ణయం తీసుకునేలోపే పెద్దసంఖ్యలో భద్రతా సిబ్బంది మావోల తూటాలకు నేలకొరిగారు. 100 నుంచి 200 మీటర్ల దూరం నుంచే మావోలు దాడి చేయడంతో తప్పించుకోవడం భద్రతా బలగాలకు కష్టసాధ్యమైంది. తేరుకున్న భద్రతా దళాలు కూడా ఎదురుదాడికి దిగినా మావోలకు జరిగిన నష్టం స్వల్పమే. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ మృతిచెందినట్టు భావిస్తున్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో అటవీ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
కాల్పుల్లో చనిపోయిన జవాన్ల త్యాగాన్ని వృథా కానివ్వబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘల్ అన్నారు. కాగా, జవాన్ల మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. వారికి నివాళులు అర్పించారు. మావోయిస్టులతో పోరాడుతూ జవాన్లు చనిపోయారన్న వార్త కలచివేసిందన్నారు. వారి త్యాగాన్ని దేశ ప్రజలెన్నడూ మరచిపోరన్నారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ నక్సల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలు వృథా కానీయమని వారి కుటుంబ సభ్యులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భరోసా ఇచ్చారు. జాడ తెలియకుండా పోయిన జవాన్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. 'ఇరువైపులా నష్టం జరిగింది. మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పిస్తున్నాను. అలాగే జవాన్ల త్యాగాలు వృథా కానీయమని వారు కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నాను' అని అమిత్‌షా అన్నారు.