అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి.. అద్దె మైకు!
posted on Apr 4, 2021 @ 4:49PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పరస్పర ఆరోపణలు, సవాళ్లు చేసుకుంటున్నారు. శనివార తిరుపతిలో ప్రచారం చేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని రౌడీల పార్టీగా అభివర్ణించారు పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటరిచ్చారు. పవన్ నాయుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాన్ని పవన్ రక్తి కట్టించాడని, తన కాల్షీట్ కు న్యాయం చేశాడని ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్ రాష్ట్రానికి అద్దెమైకులా తయారయ్యారని ఏపీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఉత్తరాది బీజేపీ దక్షిణాదికి అన్యాయం చేస్తోందని నాడు విమర్శించిన పవన్ కల్యాణ్... నేడు అదే బీజేపీకి మద్దతు ఇవ్వాలని అంటున్నారని మండిపడ్డారు. 2014లో కాంగ్రెస్ ను పారదోలాలని పిలుపునిచ్చావ్... 2019లో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలంటే చిన్న చూపు అన్నావ్... పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందన్నావ్.. ఇప్పుడేంటి రంకెలేస్తున్నావ్ అంటూ ఆపేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం కేసుల్లో బీజేపీ ప్రమేయం ఉందేమోననే అనుమానం తమకు ఉందని.. అందుకే సీబీఐ విచారణ కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్ని నాని ఆరోపించారు. వన్‌కల్యాణ్ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి అన్నారు నాని. వివేకా హత్య కేసుపై మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు అసలు ఆ కేసు విచారణ ఏ దశలో ఉందో తెలుసా? అని ప్రశ్నించారు. సీబీఐ నేరుగా కేంద్ర హోంమంత్రి అధీనంలో పనిచేస్తుందన్న విషయం తెలియదా? అని అన్నారు. పవన్ అజ్ఞాతవాసే అనుకున్నాం, కానీ అజ్ఞానవాసి అని ఇప్పుడు తెలుస్తోంది అని విమర్శించారు.