Read more!

ఊసరవెల్లికి ఉపాధ్యాయుడు ఉండవల్లి!

ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వైఎస్ హయాంలో రాజమహేంద్రవరం ఎంపీగా రెండు సార్లు పని చేసిన ఆయన వైఎస్ కు వీరభక్తహనుమాన్ గా గుర్తింపు పొందారు. వైఎస్ మరణం తరువాత ఆయన తన విధేయతను జగన్ వైపు మరల్చుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. అప్పటి నుంచీ అడపాతడపా.. కాదు కాదు జగన్ కు ఇబ్బంది వచ్చిన ప్రతి సారీ మీడియా ముందుకు వచ్చి తనకు తప్ప మరెవరికీ సాధ్యం కాని లాజిక్ తో  ప్రసంగాలు దంచేస్తుంటారు. 

ఉండవల్లి రంగులు మార్చే విద్యలో  ఊసరవెల్లికే పాఠాలు చెప్పగల దిట్ట. ఔను ఈ  స్వయం ప్రకటిత మేధావి  ఉండవల్లి జగన్ కుట్రలకు వత్తాసు పలుకడానికి తప్ప ఎన్నడూ మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు.  సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను కప్పిపుచ్చి తన వాగ్ధాటినంతా జగన్ కు మేలు చేసేలా ఉపయోగించడంతో  జనంలో క్రెడిబులిటీ కోల్పోయి చులకన అయ్యారు. ఎంత సేపూ తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ఏపీ సీఎం జగన్ కు వత్తాసు పలికేందుకు నిజాలకు మసిపూసి అబద్ధాలకు మెరుగులద్దే విద్యలో ఆరితేరిన ఉండవల్లి.. మార్గదర్శిలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రామోజీరావుపై కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన చనిపోయిన తరువాత రామోజీ వంటి  శక్తిమంతుడైన వ్యక్తిని తానెన్నడూ చూడలేదంటూ పొగడ్తల వర్షం కురిపించి మొసలి కన్నీరు కార్చేందుకు ఇసుమంతైనా వెనుకాడలేదు. 
రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత.. ఉండవల్లి క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పోలవరం, అమరావతి నిర్మాణాలపై తర్కానికి అందని విమర్శలు చేస్తూ ఉండేవారు. అదే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉండవల్లి మీడియా ముందుకు జగన్ ను పొగడడానికి మాత్రమే వచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం పనులు ఆగిపోవడంపై కానీ, అమరావతిని జగన్ సర్కార్ నిర్వీర్యం చేయడంపై గానీ ఉండవల్లి ఎన్నడూ నోరెత్తిన దాఖలాలు లేవు.  

ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం పాలు కాగానే ఆయన అసలు ఏపీలో వైసీపీ అనే పార్టీయే లేదు ఉన్నదల్లా జగన్ ఒక్కడే అంటూ మీడియా ఎదుట ఓ బ్రహ్మాండమైన ప్రకటన చేసేసి ఆ విషయంలో తాను జగన్ కు ఎన్నిసార్లు సుద్దులు చెప్పినా పట్టించుకోలేదని ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ఐదేళ్లూ జగన్ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని అన్యాపదేశంగా ఓ చిన్న బోధ కూడా చేసేశారు.  

అధకారంలో ఉన్నంత కాలం జగన్ పార్టీ నేతలు సభ్యత, సంస్కారం మరచి బూతులతో ప్రత్యర్థి నేతలపై రెచ్చిపోయినప్పుడు వాటిని వారించడానికి కానీ, తప్పు అని చెప్పడానికి కానీ ఎన్నడూ నోరెత్తని ఉండవల్లి, జగన్ అధికారం కోల్పోగానే ఆయనకు మద్దతుగా బూతులు మాట్లాడిన నేతల కారణంగానే వైసీపీ పరాజయం పాలైందని ఓ స్టేట్ మెంట్ ఇచ్చి పారేశారు. ఇప్పటికైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సుద్దులు చెప్పిన ఉండవల్లి ఊసరవెల్లికే రంగులు మార్చే విద్యలో తర్ఫీదు ఇవ్వగలరనిపించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.