Read more!

పోలీసు శాఖ సమూల ప్రక్షాళన!

శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ ప్రశక్తే లేదనీ, పోలీసు శాఖ చట్ట ప్రకారం పని చేయాలనీ, వైసీపీ హయంలో పోలీసు శాఖ ఏలిన వారి తొత్తులా వ్యవహరించిందనీ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తామనీ, పోలీసులు చట్ట ప్రకారం పని చేయాలన్నారు. గత ప్రభుత్వ ఆలోచనలతో పని చేసే అధికారులెవరినీ ఉపేక్షించేది లేదన్నారు. 

వంగలపూడి అనిత.. తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్ మహిళ. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో హోంమంత్రి. చంద్రబాబు కేబినెట్ లో స్థానం పొందిన అనితకు ముఖ్యమంత్రి హోంశాఖను కేటాయించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు.  ఉన్నప్పుడు జగన్ సర్కార్ పోలీసులను ఉపయోగించి ప్రత్యర్థులను ఎంతగా వేధించిందో తెలియంది కాదు. అలా పోలీసు వేధింపులకు స్వయంగా వంగలపూడి అనిత కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె రాష్ట్రంలో పోలీసు శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. 

జగన్ సర్కార్ పోలీసు శాఖను తన జేబు సంస్థగా, తమ కనుసన్నలలో మెలిగే బానిస వ్యవస్థగా మార్చేసుకుందని విమర్శించారు. ఉనికిలోనే లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా చెబుతూ జగన్ సర్కార్ ఆటలాడిందని విమర్శించారు. జగన్ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు జరుగుతున్నా పోలీసు శాఖ చోద్యం చూసినట్లు చూసిందనీ, అయితే ఆ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండదనీ, మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటూ భయపడేలా తమ ప్రభుత్వ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అదే విధంగా గంజాయి స్మగ్లింగ్, సరఫరాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

పోలీసు అధికారులపై కక్ష సాధింపులు ఉండవని చెప్పిన అనిత తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం ప్రభుత్వ బాధ్యత అని ఆ దిశగానే తమ చర్యలు ఉంటాయని చెప్పారు.  గత ప్రభుత్వంలో పోటీసులు తనపై అట్రాసిటీ కేసు పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ పోలీసులు ప్రజల కోసం చట్ట ప్రకారం పని చేయాలని, వారి చేత అలా పని చేయిస్తామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో  చాలా మంది ఐపీఎస్ లు వైసీపీకి, జగన్ కు తొత్తులుగా, తైనాతీలుగా పని చేశారని విమర్శించిన ఆమె , తమ ప్రభుత్వంలో  అటువంటి పరిస్థితి ఉండదన్నారు. ఐపీఎస్ లు, పోలీసుల గౌరవాన్ని పెంచేలా చంద్రబాబు ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు.  పోలీసులు చట్ట ప్రకారం పని చేయాలని, అలా కాకుండా ఇప్పటికీ వైసీపీ ఆలోచనలతో పని చేసే అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించం, సహించమని స్పష్టమైన హెచ్చరిక  చేశారు.