అన్న క్యాంటిన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక!

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కొలువుదీరగానే పేదలకు తక్కువ ధరకే పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలుపై సంతకం చేశారు. సెప్టెంబర్ 21లోగా రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేదలకు కేవలం 15 రూపాయల ఖర్చుతో మూడు పూటలా కడుపు నింపాలన్న ఉదాత్త ఆశయంతో చంద్రబాబు ప్రభుత్వం గతంలో ప్రారంభించిన అన్న క్యాంటిన్లను జగన్ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పునరుద్ధరణ ఫైలుపై సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజునే సంతకం చేశారు. అంతే కాకుండా సెప్టెంబర్ 21లోగా అన్న క్యాంటిన్లను ప్రారంభించాలని ఆదేశించారు. ఇందు కోసం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను చంద్రబాబు ప్రభుత్వం రూపొందించింది. ఈ ప్రణాళిక శనివారం (జూన్ 15) నుంచే ప్రారంభం అయ్యింది. పురపాలక, నగరపాలక సంస్థల కమిషనర్లు, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగస్వాములను చేశారు. 

 గతంలో ప్రారంభించిన క్యాంటీన్నల ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే కమిషనర్లను ఆదేశించింది. గతంలో మంజూరు చేసిన  203 క్యాంటీన్లకు గాను 184 క్యాంటీన్లు అప్పట్లోనే పూర్తయ్యాయి.   పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు శనివారం (జూన్ 15) పట్టణ, స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటిన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్ ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదిక రూపొందిస్తారు.  ఆ తరువాత జూన్ 19న క్యాంటిన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు మునిసిపల్ ఇంజినీర్లు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో  కలిపి కమిషనర్లు అంచనాలు రూపొందిస్తారు. ఇక జూన్ 30 నాటికి ఇప్పటికీ భవన నిర్మాణాలు జరగని క్యాంటిన్ల పనులు చేపట్టేందుకు స్థానిక ప్రజా ప్రతినిథులతో కలిసి స్థలాల ఎంపిక జరుగుతుంది. క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాలలో నిర్వహిస్తున్న వార్డు, సచివాలయాలను ఖాళీ చేయించి వాటిని ప్రత్యామ్నాయ భవనాలను ఎంపిక చేస్తారు. 

ఇక వచ్చే నెల 30 నాటికి   క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేస్తారు.  క్యాంటీన్ల పర్యవేక్షణ, స్మార్ట్ బిల్లింగ్, విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థలను ఖరారు ఖరారు చేస్తారు. 

ఇక ఆగస్టు 15 నాటికి క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్తపరికరాలు, సాఫ్ట్వేర్ సమీకరణ, ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. అదే తేదీ నాటికి మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో  ఒప్పందాలు పూర్తి చేసుకోవలసి ఉంటుంది.  తాగునీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ సహా సదుపాయాలన్నీ కల్పించాల్సి ఉంటుంది. ఇక  సెప్టెంబరు 21 నాటికి  పుర, నగరపాలక సంస్థల్లో 203 క్యాంటీన్లను ప్రారంభించాల్సి ఉంటుంది.