మాజీ మంత్రి అనిల్ కు బాబాయ్ పోటు
posted on Aug 25, 2022 @ 11:58AM
మొన్నటి దాకా చిన్నా..పెద్దా తేడా లేకుండా అందరిపైనా నోరు పారేసుకున్నారు. అందుకు బహుమతిగా మంత్రి పదవి ఊడింది. తాజా మంత్రి కాకాణిపైనా రెచ్చిపోయారు. సీన్ కట్ చేస్తే.. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలంతా కలిసి తోక కట్ చేసి ఓ మూలన పడేశారు. ఆయనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వరుస పరాభవాలతో ఇప్పటికే తలపట్టుకుంటున్న అనిల్ కు ఇప్పుడు సొంత బాబాయ్ రూపంలో మరో గండం తరుముకొస్తోంది. 2024 ఎన్నికల్లో అనిల్ కు చుక్కలు చూపిస్తానంటున్నారు ఆయన బాబాయ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.
నిన్నటి దాకా అనీల్ కుమార్ ను అన్నీ తానై నడిపిన రూప్ కుమార్ ఒక్కసారిగా అబ్బాయ్ అనిల్ పై ఇంతలా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారనే చర్చ ఇటు పార్టీలోనూ, అటు నెల్లూరు జనంలోనూ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందిజరుగుతోంది. అనిల్ ను చేరదీసి కార్పొరేటర్ ని చేసి, నెల్లూరు నగర ఎమ్మెల్యే టిక్కెట్టు ఇప్పించిన ఆనం కుటుంబాన్నే వెన్నుపొటు పొడిచారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కు రూప్ కుమార్ అండ అంతా..ఇంతా కాదు. నెల్లూరులో అనిల్ రాజకీయాలు చేయడానికి ఒక రకంగా రూప్ కుమారే కారణం. నోటి దురుసుతో అందరినీ దూరం చేసుకున్న అనిల్ కు ఇప్పుడు బాబాయ్ రూప్ కుమార్ తలనొప్పిగా మారారు.
అనిల్ ఆఫీసుకు కొద్ది దూరంలో జగనన్న భవన్ అని కొత్త కార్యాలయాన్ని రూప్ కుమార్ ప్రారంభించారు. కార్యకర్తలను భారీగా సమీకరించి అనిల్, తాను విడిపోయామనే సంకేతం పంపారు రూప్ కుమార్. అది జరిగిన రెండు రోజులకే రూప్ కుమార్ వర్గంపై కేసులు బనాయించే ప్రయత్నం చేసేలా పోలీసులను అనిల్ పురమాయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రూప్ కుమార్ పోలీస్ స్టేషనులోనే తిష్టవేసి, తన అనుచరులను విడిపించుకున్నారు. అంతటితో ఆగకుండా అనిల్ ఇది జెస్ట్ ట్రయల్ మాత్రమే.. త్వరలో త్రిబులార్ సినిమా చూపిస్తానని హెచ్చరించారు. పెద్ద..పెద్ద కుటుంబాలనే ఓ ఆటాడుకున్నా.. అనిల్ ఆఫ్ట్రాల్ నువ్వెంత అంటూ రూప్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. దీంతో నెల్లూరు సిటీలో అనిల్ పరువు కాస్తా గంగలో కలిసిందంటున్నారు.
ఎంత అబ్బాయ్ అయితే మాత్రం.. సిట్టింగ్ ఎమ్మెల్యే.. మాజీమంత్రి అందులోనూ జగన్ వదిలిన ‘బూతు బాణం’.. అనిల్ కుమార్ నే హెచ్చరించడంతో రూప్ కుమార్ వార్తల్లోకెక్కారు. ఇప్పుడు రూప్ కుమార్ వేరుకుంపటి పెట్టడంతో బాబాయ్- అబ్బాయ్ మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది? అసలేం జరిగింది? అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది.