బండి సంజయ్ యాత్రపై హైకోర్టులో విచారణ
posted on Aug 25, 2022 @ 11:50AM
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ్ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులపై దాఖలైన పిటిషన్ పై హై కోర్టు గురవారం మధ్యాహ్నం విచారణ జరపనుంది. బండి సంజయ్ పాదయాత్రపై పోలీసు ఆంక్షలను సవాల్ చేస్తూ బీజేపీ బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. బండి సంజయ్ మూడో విడత యాత్రకు అనుమతులు లేవనీ, వెంటనే నిలిపివేయాలనీ వర్ధన్నపూట ఏసీపీ నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. అంతే కాకుండా యాత్రలో బండి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రను వెంటనే నిలిపివేయకుంటే చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.
ఇలా ఉండగా బండి సంజయ్ యాత్రను నిలిపివేయాలంటే పోలీసులు నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమౌతున్నది. ఇంత కాలం అవసరం లేని అనుమతులు యాత్ర మరో మూడు రోజులలో ముగుస్తుందనగా అవసరమయ్యాయా అని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇప్పుడు యాత్రను అడ్డుకోవడం వల్ల బండి సంజయ్ కు, బీజేపీకీ చేతులారా మైలేజ్ కలిగించడమే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అంతర్గత సంభాషణల్లో అదే విషయాన్ని చర్చించుకుంటున్నారు.
బండి ప్రజా సంగ్రామ యాత్ర.. ఆ యాత్ర ఎప్పుడు ఎక్కడ జరుగుతోందో కూడా రాష్ట్రంలో జనం పట్టించుకోవడం లేదనీ, విడతల వారీగా బండి ప్రజా సంగ్రామ యాత్ర అంటూ నడుస్తున్నారు తప్ప ఆ యాత్రకు ఎలాంటి గుర్తింపు, ఆదరణ ఉన్న దాఖలాలు లేవనీ టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.
ఆ యాత్రలో ఆయన చేస్తున్న విమర్శలు, ప్రసంగాలూ అన్నీ కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ అవినీతి అన్న విమర్శలు తప్ప కొత్తదనం ఏమీ లేదనీ, జనం కూడా ఆ విమర్శలనూ, ప్రసంగాలనూ పట్టించుకోవడం లేదనీ టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలో బండి పాదయాత్ర వల్ల ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతోందంటూ యాత్రకు బ్రేక్ వేయడం ఎందుకో? దాని వెనక ఉన్న వ్యూహమేమిటో అర్ధం కావడం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు. అవసరం లేని ఆంక్షల వల్ల బీజేపీ గ్రాఫ్ పెరగడం వినా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు. పైగా బండి సంగ్రామ యాత్ర దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు యాత్రను నిలువరించి టీఆర్ఎస్ ఏం సాధిద్దామనుకుంటోందన్నది ఆ పార్టీ వ్యూహకర్తలే చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.
యాత్ర సాగడం కంటే యాత్రను నిలువరించడం వల్లనే బీజేపీకి ఎక్కువ మైలేజ్ వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానికి ఉదాహరణగా పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన తరువాత ఇంత కాలంగా బండి ప్రజాసంగ్రామ యాత్రకు రాని కవరేజి మీడియాలో వచ్చింది. సామాజిక మాధ్యమంలో కూడా బండియాత్ర నిలుపుదల గురించి విస్తృతంగా ప్రచారం లభించింది. ఇప్పటి దాకా పెద్దగా యాత్రను పట్టించుకోని జనం కూడా యాత్ర ఎందుకు నిలిపేస్తున్నారన్న విషయంపై చర్చించుకుంటున్నారు. అన్నిటికీ మించి బండి పాదయాత్రకు అవరోధాలు కలిగించడంపై బీజేపీ అగ్రనేతలు సైతం స్పందించి ప్రకటనలు, ఖండనలు గుప్పిస్తున్నారు. దీంతో విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
అన్నిటికీ మించి లిక్కర్ స్కాం లో కేసీఆర్ తనయ కవిత పేరు బయటకు రావడం వల్లనే బీజేపీపై టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పట్టించుకోకుండా వదిలేస్తే ఏ ప్రచారం లేకుండా ఎప్పుడు మొదలైందో.. ఎప్పుడు ముగిసిందో తెలియకుండా పూర్తి కావలసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పుడు ఆంక్షల వల్ల అందరికీ తెలిసింది. చర్చకు కేంద్రంగా మారింది. దీనివల్ల బీజేపీకి మైలేజి పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.