ఉమా మహేశ్వరిది ఆత్మహత్యే.. తేల్చిన పోస్టుమార్టం నివేదిక
posted on Aug 6, 2022 @ 11:34AM
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరిది ఆత్మహత్యే. ఈ విషయాన్ని పోస్టుమార్టం నివేదిక విస్పష్టంగా తేల్చేసింది. దీంతో ఇన్ని రోజులుగా వైసీసీ సోషల్ మీడియా ఆమె మరణం విషయంలో చేసిన హంగామా, శవ రాజకీయాలకు చెక్ పడింది.
ఒక కుటుంబం, అదీ తెలుగువారు ఇలవేల్పుగా భావించే ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో ఉన్న సమయంలో వైసీపీ ఆడిన వికృత రాజకీయ క్రీడపై ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ పార్టీ ఎంపీ చేసిన వరుస ట్వీట్ల పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే గోరంట్ల మాధవ్ అసభ్య వీడియోపై విజయసాయి నోరుమెదపరెందుకని నిలదీతస్తున్నారు.
ఇక ఉమామహేశ్వరి పోస్టు మార్టం విషయానికి వస్తే మెడకు ఉరి గట్టిగా బిగుసుకోవడం వల్ల స్వర పేటిక విరిగి ఆమె మరణించారు. అగస్టు 1న ఉమామహేశ్వరి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించిన సంగతి తెలిసిందే.
పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తీవ్రమైన మానసిక ఒత్తడి, అనారోగ్యం కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరిది ఆత్మహత్యే అని తేలడంతో ప్రజలు, తెలుగుదేశం వర్గాలు వైసీపీపైనా, ఆమె మరణం విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.