వైసీపీ నేతలు ఇక బరితెగించనున్నారా?
posted on Aug 6, 2022 @ 12:03PM
గోరంట్ల మాధవ్ వ్యవహారంలో వైసీపీ హైకమాండ్ ఎటువంటి చర్యా తీసుకోకపోవడంతో వైసీసీ నేతలు ఇక బరితెగించనున్నారా? అంటే విపక్షాలు ఔననే అంటున్నాయి. విపక్షంలో కూర్చుంటే వైసీపీ నేతలకు ఇక తమ విశృఖలత్వానికి అవకాశం ఉండదన్న యోచనలో పార్టీ అధికారంలో ఉండగానే తమ విశ్వరూపం చూపించేయాలన్న ఆత్రుత వారిలో పెరిగిపోతోందని అంటున్నారు.
చిన్నా చితకా నేతల వ్యవహారాలు అటుంచితే పార్టీలో కీలక పదవులలో ఉన్న వారి అసభ్య, అనుచిత వర్తనను నియంత్రించలేని వైసీపీ అధినేత తీరును అలుసుగా తీసుకున ఇక పార్టీలో ఇలాంటి విశృంఖలత పెరిగిపోయే అవకాశాలే ఎక్కువ అని పరిశీలకులు కూడా అంటున్నారు. వైసీపీలో ఏం చేసినా చెల్లిపోతుందన్న భావన శ్రేణుల్లో ఎక్కువయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండగా అంబటి ఒక మహిళలో అసభ్యంగా మాట్లాడిన నాడే ఆయనపై చర్య తీసుకుని ఉండి ఉంటే ఆ తరువాత మంత్రి అవంతి శ్రీనివాస్.. ఇప్పుడు గోరంట్ల మాధవ్ లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి ఉండే వారు కాదని అంటున్నారు. సభ్యత, సంస్కారం, నైతికత వంటి వాటి పట్ల పార్టీ హైకమాండ్ కు పెద్దగా పట్టింపు లేకపోవడం వల్లే పార్టీలో ఇటువంటి ధోరణి ప్రబలుతోందని అంటున్నారు. ఇక ప్రతి విషయంలోనూ ఎదురుదాడే మంత్రంగా భావించే వైసీపీ ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలో పార్టీ పరువు పోయిందని పెద్దగా బాధపడటం లేదనీ, ఇలానే విపక్షం పరువు తీయడం ఎలా అన్న యోచనే చేస్తుందని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి.
ఎవరో ఒకరు, ఏదో ఒక తప్పు చేసిన ఆధారం దొరక్కపోదా అని విపక్ష నేతల వ్యవహారాలపై నిఘా పెట్టిందనీ, వారి కార్యకలాపాలను జల్లెడ పడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాధవ్ విషయంలో చర్య తీసుకోకపోవడం అటుంచి.. పార్టీ సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో పడిపోయిన మాట మాత్రం వాస్తవమని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఈ విషయంలో విపక్షాల విమర్శలను నోరేసుకు పడిపోయి ఖండించేసే అంబటి వంటి వారు మాట్లాడడానికి కూడా సాహసించకపోవడం, మాజీ మంత్రులు, అవకాశం ఉన్నా లేకున్నా విపక్ష నేతలపై బూతుల పంచాంగంతో విరుచుకుపడిపోయే కొడాలి నాని వంటి వారు మౌనముద్ర వహించడమే గోరంట్ల విషయంలో వైసీపీ ఎంత డిఫెన్స్ లో పడిందో అవగతమౌతోందని అంటున్నారు. ఇంతగా పరువు బజారున పడినా గోరంట్లపై ఈగ కూడా వాలకుండా పార్టీ వ్యవహరిస్తోందంటే.. గోరంట్లపై చర్య తీసుకుంటే ఇంకెన్ని బాగోతాలు బయటపడతాయో అన్న భయమే కారణమని చెబుతున్నారు.