తిరుపతిలో పాల్ పర్యటన వినోదాత్మకం
posted on Aug 3, 2022 @ 11:55AM
కేఏ పాల్.. పరిచయం అక్కర్లేని పొలిటికల్ కమేడియన్. ఆయన ఎప్పుడు ఎక్కడ ప్రసంగించినా.. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నవ్వులు పూయడం ఖాయం. ఆయన విమర్శలను ఏ పార్టీ వారూ సీరియస్ గా తీసుకోరు. ఆయన విమర్శలకు ఎవరి నుంచీ ఖండనలు ఉండవు. ఏ పార్టీ వారూ స్పందించరు. అయినా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే విలేకరులు పరుగు పరుగున వాలిపోతారు. ఎలక్ట్రానిక్ మీడియా రెక్కలు గట్టుకుని వాలిపోతారు. పత్రికలలో ఆయన ప్రసంగాలకు స్పేస్ లేకపోవడమనే మాటే ఉండదు.
టీవీలలో ఆయన ప్రసంగాల క్లిప్పింగ్స్ కు ఒకింత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే జనం ఆయన ప్రసంగాలను అంత ఇష్టంతో వింటారు, చదువుతారు కనుక. మత ప్రబోధకుడి నుంచి రాజకీయ వేత్తగా మారిన తరువాత కేఏ పాల్ తన ప్రసంగాలలో కూడా రాజకీయ ప్రభోదాలే చేస్తారు. అలా ప్రబోధించడంలో ఆయనకు తన పర బేధం లేదు. ఆయన ఎవరినైతే, ఏ పార్టీనైతే విమర్శిస్తారో వారికీ , ఆ పార్టీలకూ కూడా సుద్దులు చెబుతారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందరూ అంటే అన్ని పార్టీలూ తన వెనుకే నడిస్తేనా ఆ పార్టీలకు మనుగడ అని ఉద్భోదిస్తారు. తాజాగా తిరుపతి పర్యటనలో ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయంపై చాలా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్, చంద్రబాబులు ఓటమి ఖాయమని తేల్చేశారు. రెండు రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చేది తన ప్రజాశాంతి పార్టీయేనని తేల్చేశారు. తాను తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాననీ, ఏపీలో ఒక మహిళా నేతను సీఎంను చేస్తాననీ పాల్ చెప్పారు. ఏపీలో జనసేనానికి అసలు ప్రజాభిమానమే లేదన్నారు.
తనకున్న ప్రజా మద్దతుతో పోలిస్తే పవన్ కల్యాణ్ కు ఉన్న మద్దతు ఏపాటిదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవాలంటే జగన్, చంద్రబాబు తమతమ పార్టీలను ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయడం బెటరని సలహా ఇచ్చారు. ఇక జాతీయ నేతలకూ ఆయన తన రాజకీయ ప్రబోధం చేశారు. తానిచ్చిన విలువైన సలహాలను పాటించకపోవడం వల్లే మోడీకి ప్రజా మద్దతు భారీగా తగ్గిపోయిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీ గద్దె దిగడం ఖాయమనీ జోస్యం చెప్పారు.
పాల్ ఏం చేసినా, ఏం మాట్లాడినా ప్రచారానికి ఢోకా ఉండదు. అయినా ఆయన అదనపు ప్రచారం కోసం కొన్ని ఫీట్లు చేసి మరీ వినోదం పంచుతారు. తిరుపతి పర్యటనలో కూడా అదే చేశారు. ఆయన తన వాహనంలో పద్మావతి మహిళా యూనివర్సిటీలోకి దూసుకెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా ఆగలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు వచ్చి ఆయనను పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే పాల్ మాత్రం కారులోనూ కూర్చుని తన సొంత వాహనంలోనే పోలీసు స్టేషన్ కు వస్తానని భీష్మించారు. చివరకు పోలీసులు అతి బలవంతం మీద ఆయనను వర్సిటీ నుంచి బయటకు పంపేశారు. తరువాత తీరిగ్గా కేసు నమోదు చేశారనుకోండి. మొత్తం మీద పాల్ తిరుపతి పర్యటన అంతా వినోదాల జల్లు పంచుతూ సాగింది.