నకిరేకల్ లో కేటీఆర్ పై రెండు కేసులు
posted on Mar 26, 2025 @ 3:49PM
బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై నల్లొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా కకిరేకల్ పోలీసు స్టేషన్ లో కేటీఆర్ పై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ సోషల్‌మీడియా యాక్టివిస్టులు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
నకిరేకల్‌లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో సోషల్ మీడియా వేదికగా తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత, మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్ వేర్వేరుగా నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేపర్ లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం ఉందంటూ తెలుగు స్క్రైబ్‌లో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ఎక్స్ లో షేర్ చేసినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. చౌగోని రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ 1గా మన్నె క్రిశాంక్, ఏ 2 గా కేటీఆర్, ఏ 3గా కొణతం దిలీప్ కుమార్‌లతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఉగ్గిడి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఏ1 గా కొణతం దిలీప్ కుమార్ , ఏ2గా మన్నే క్రిశాంక్, ఏ 3గా కేటీఆర్, మరికొందరిపైనా కేసు నమోదు చేశారు.
పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో మొత్తం 11 మంది నిందితులతోపాటు ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒక మైనర్ బాలునితో పాట ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.