ట్విట్టర్ షట్ డౌన్!
posted on Nov 18, 2022 @ 12:13PM
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసులు షట్ డౌన్ అయ్యాయి. సోమవారం (నవంబర్ 21) వరకూ ఉద్యోగులు ఆఫీసుకు రావద్దని ఉద్యోగులకు ఎలాన్ మస్క్ ఈ మెయిల్.. ద్వారా అల్టిమేటమ్ జారీ చేశారు. అంతే కాకుండా ఇప్పటికే 3500మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన ట్విట్టర్.. మిగిలిన ఉద్యోగులు కొనసాగాలంటే 12 గంటలు పనిచేయాల్సిందేనని హుకుం జారీ చేసింది.
వివాదాలు, కేసుల నడుమ ‘ట్విట్టర్’ను ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వాక్ స్వాతంత్యానికి నిజమైన వేదికగా ట్విట్టర్ ను మార్పు చేస్తానంటూ టేకోవర్ చేసిన మస్క్ దానిలో మార్పులు తేవడం సంగతి అంటుంచి నిలువెత్తు లోతులో పాతరేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విట్టర్ లో అడుగు పెట్టిన రోజునే ఆ సంస్థలో టాప్ స్థాయిలో ఉన్న పలువురికి ఉద్వాసన పలికారు. సంస్థలో పనిచేస్తున్న సగం మందిని కూడా ఇంటికి సాగనంపుతానని ప్రకటించారు. ఇప్పటికే3500 మందిని ఊస్ట్ చేసి పారేశారు.
ఉన్న సిబ్బంది కూడా రోజుకు 12 గంటలు ఊడిగం లేదా వెట్టి చాకిరీ చేసి తీరాలన్నకండీషన్ పెట్టారు. ఇంకా రకాల పని నిబంధనలతో వారి ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేశారు. ఎలాన్ మస్క్ తుగ్లక్ నిర్ణయాలతో విసిగి వేసారిపోయిన వందలాది మంది ఉద్యోగులు ట్విట్టర్ కు గుడ్ బై చెబుతున్నారు. గురువారం సాయంత్రం మొదలైన ట్విట్టర్ ఉద్యోగుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. సంస్థను మెరుగు పరిచేందుకు కష్టపడి పని చేస్తారా.. వెళ్లిపోతారా అంటూ మస్క్ ఇచ్చిన అల్టిమేటం మొదటికే మోసం తెచ్చినట్లు కనిపిస్తోంది.
ట్విట్టర్ అంతర్గత సమాచార వేదికల్లో ఉద్యోగులంతా ‘సెల్యూట్ ఎమోజీలు’ పోస్టు చేస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమంపై ‘రిప్ ట్విట్టర్’ అనే ట్యాగ్ లైన్ తో అనేక మంది ఎలాన్ మస్క్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా రిప్ ట్విట్టర్ ట్యాగ్ లైన్ తో వందల సంఖ్యలు ట్వీట్లు చేస్తున్న వారు ఆ సంస్థకు గుడ్ బై చెప్పిన వారే అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దాన్ని అత్యంత వేగంగా జనానికి తెలిసేలా చేస్తున్న బలమైన వేదిక ట్విట్టర్ పిట్ట అనడంలో సందేహం లేదు. ఇక ట్విట్టర్ లోని ‘ట్రెండింగ్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విషయాలను సాధారణ యూజర్లకు కూడా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పడంలో ముందుంటుంది.
అలాంటి ట్విట్టర్ లో ఇప్పుడు ‘రిప్ ట్విట్టర్’ విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. రిప్ ట్విట్టర్ అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మస్క్ తీరుతో విసిగిపోవడమే కాకుండా కొత్త కొత్తగా పెడుతున్న షరతులు, సంస్థలో మారిపోతున్న పరిస్థితులను తట్టుకోలేక వందలాది మంది రాజీనామాలు చేస్తుడడంతో ట్విట్టర్ భవిష్యత్ ఆందోళనకరంగా మారే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. పలువురు ఉద్యోగులు ట్విట్టర్ స్లాక్ లో శాల్యూట్ ఎమోజీలు, ఫేర్ వెల్ మెసేజ్ లు పెట్టడం సంచలనం రేకెత్తిస్తోంది. ‘వాలంటరీ లే ఆఫ్’ పేరుతో సుమారు 360 మంది ఓ చానల్ ఏర్పాటు చేసినట్లు ఒక ఉద్యోగి వెల్లడించాడు.