ఏపీ సర్కార్ కు మరో సలహాదారు..!
posted on Nov 18, 2022 @ 11:56AM
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ కు ఎంత మంది సలహాదారులున్నా సరిపోవడం లేదు. రోజుకొక సలహాదారు చొప్పున నియామకాలు జరుగుతున్నాయా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.
కనిపించిన వారందరికీ పదవులు కట్టబేట్టేయాలన్న తొందర జగన్ లో కనిపిస్తోంది. ఎవరిలోనైనా పదవి దక్కలేదన్న కించిత్ అసంతృప్తి పొడసూపుతోందన్న అనుమానం వస్తే చాలు వారకి ఓ సలహాదారు పదవి కట్టబెట్టేస్తున్నారు. పార్టీలో రాజకీయ నిరుద్యోగం లేకుండా చేసేయాలన్న ఆత్రంతో సలహాదారు పదవుల పందేరంలో మరే విషయంలోనూ లేనంత వేగం చూపుతున్నారు
ముఖ్యమంత్రి జగన్ . తాజాగా వైసీపీ అధికార ప్రతినిథి నారమల్లి పద్మజకు సలహాదారు పదవిని కట్టబెట్టేశారు. ఆమెకు మహిళాశిశుసంక్షేమ, దివ్యాంగ వృద్ధుల విభాగానికి సలహాదారుగా పదవిని కట్టబెట్టేసారు. ఈ పదవి దక్కిన ఆమెకు నెలకు లక్షల్లో వేతనం లభిస్తుంది. సలహాదారు పదవుల నియామకం విషయంలో జగన్ ఒక పద్ధతీ పాడూ పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా ఖాతరు చేయడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలిచ్చే దిక్కు లేదు కానీ.. అయిన వారికి సలహాదారు పేరుతో లక్షల ప్రజాధనాన్ని వేతనాలుగా నిర్ణయించి నియామకాలు కానిచ్చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి నాలుగళ్ల కిందట వైసీపీ గూటికి చేరిన నారుమల్లి పద్మజారెడ్డి ఇంత కాలం వైసీపీ అధికార ప్రతినిథిగా మీడియా ముందుకు వచ్చి, లేదా సామాజిక మాధ్యమంలో విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ఉండటమే పనిగా పెట్టుకున్నారు. ఇంతగా నోరు చేసుకున్నందుకు ఏదో పదవి కావాలని ఆమె గత నాలుగేళ్లుగా జగన్ ను కోరుతూనే ఉన్నారు.
ఇక ఇప్పుడు ఎన్నికల వేడి మొదలు కావడంతో ఇప్పటికీ పదవి ఇవ్వక పోతే ఆమె నొచ్చుకుంటారనుకున్నారో ఏమో.. జగన్ మరో సలహాదారు పదవిని సృష్టించి ఆమెకు కట్టబెట్టేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఏయే శాఖలలో అయితేనేం దాదాపు 80 మంది సలహాదారులు ఉన్నారు. రానున్న రోజులలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.