పాతికేళ్ల పోరాటం.. 18 రోజుల ఉద్యోగం!
posted on May 2, 2023 @ 4:22PM
కష్టపడి చదువుకున్న మధ్య తరగతి ప్రజలకు ప్రబుత్వ ఉద్యోగం సాధించడం ఓ కల. ఆ కల సాకారం చేసుకోవాలని తొమ్మది వే మంది డీఎస్సీ అభ్యర్థులు పాతికేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 1998లో డీఎస్సీలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం చేస్తున్న నిరీక్షణ ఆంధ్రప్రదేశ్ లో ఫలించింది. గత నెల 12న 4072 మంది డిఎస్సీ 1998 అభ్యర్థుల నియామకాలు జరిగాయి. అయితే వారిలో ఎక్కువ మంది కొద్ది నెలలు మాత్రమే టీచర్లుగా సేవలందించబోతున్నారు.
పాతికేళ్లుగా ఎదురు చేసి పాతిక రోజులు కూడా ఉపాధ్యాయులుగా పని చేయేకపోయిన కొంత మంది ఏప్రిల్ 30న రిటైర్ అయ్యారు. వీరికి 60 ఏళ్లు కటీఫ్ విధించడంతో అన్నమయ్య జిల్లా గుర్రం కొండలో ఓ టీచర్ 18 రోజులకే రిటైరయ్యారు.
ఆయన పేరు వెంకట శివారెడ్డి. ఊరు ఎల్లుట్ల. 1998 డీఎస్సీకి ఎంపికయ్యారు. డీఎస్సీ 1998 ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంతో వెంకటశివారెడ్డి ఈ నెల 13న దౌలత్ ఖాన్ పల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. ఆయన అప్పటి కి గుర్రం కొండ సింగిల్ విండో చైర్మన్. అయితే ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న అభిమానం, గౌరవంతో సింగిల్ విండో చైర్మన్ పదవికి రాజీనామా చేసి మరీ టీచర్ గా విధుల్లో చేరారు.
ఆయనకు ఈ నెల 30తో 60 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో పాతికేళ్లు ఎదురు చూసి ఎదురు చూసి చేరిన ఉద్యోగంలో కేవలం 18 రోజులు మాత్రమే పని చేసి రిటైర్ అయ్యారు. సింగిల్ విండో చైర్మన్‌గా ఉన్న ఆయన ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో రాజీనామా చేయడం, ఇప్పుడు ఉద్యోగం నుంచి బయటకు రావడంతో అటు రాజకీయంగా..ఇటు ఉపాధ్యాయుడిగా హోదా లేకపోయింది. ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాననీ, ఇపుడు మళ్లీ రాజకీయాలలో రాణిస్తాననీ ఆయన చెబుతున్నారు. సింగిల్ విండో చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.