పసుపు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువగా వాడితే ఈ నష్టాలు తప్పవు..!
posted on Jan 25, 2025 @ 9:30AM
పసుపు భారతీయ వంటింట్లో తప్పనిసరిగా ఉండే పదార్థం. పసుపును వంటల నుండి వైద్యం వరకు చాలా రకాలుగా వాడతారు. పసుపు గొప్ప ఔషద గుణాలు కలిగి ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందుకే ఏదైనా దెబ్బ తగలగానే మొదట పసుపు పెడతారు. ఇది రక్తస్రావం ఎక్కువ జరగకుండా చేస్తుంది. ఇక చర్మ సంరక్షణలో కూడా పసుపు వాడకం ఎక్కువే.. పచ్చి పసుపు, ఛాయ పసుపు.. కస్తూరి పసుపు .. ఇలా చాలా రకాలే ఉన్నాయి. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పసుపు ఆరోగ్యానికి మంచిదే కానీ.. పసుపును ఎక్కువగా వాడితే దాని వల్ల నష్టం కూడా తప్పదట. ఇంతకీ వసుపు వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుంటే..
పసుపు ఆరోగ్యానికి మంచిదే కానీ దాన్ని ఎక్కువగా వాడితే అది అతిసారం సమస్యకు కారణం అవుతుంది. గ్యాస్, అపానవాయువు, డయేరియా వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందుకే పసుపును మితంగానే వాడాలి.
రక్తం చాలా చిక్కగా ఉన్న వ్యక్తులు రక్తం పలుచ బడటానికి మందులు వాడుతుంటారు. ఇలాంటి వారు పసుపును చాలా జాగ్రత్తగా వాడాలి. పసుపును అతిగా తీసుకోవడం వల్ల రక్తానికి సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
పసుపు వేడి స్వభావం కలిగి ఉంటుంది. దీన్ని అధికంగా వాడితే ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది. ఫలితంగా చర్మం పైన దద్దుర్లు, మంట, దురద వంటివి కలిగిస్తుంది. చర్మం లోపలి నుండి వాపులు కూడా కలిగిస్తుంది. అందుకే పసుపును అతిగా వాడకూడదు.
పసుపును ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుందట. కిడ్నీ స్టోన్స్ మాత్రమే కాకుండా తలనొప్పి సమస్య కూడా రావచ్చట. అందుకే పసుపును అధికంగా తినకూడదు.
పసుపు గర్బాశయ కండరాలను ఉత్తేజ పరుస్తుంది. అందుకే గర్బిణీ స్త్రీలు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం.
*రూపశ్రీ.