ఏ పోషకాలు లోపించడం వల్ల జుట్టు బాగా రాలిపోతుందో తెలుసా?
posted on Jan 28, 2025 @ 9:30AM
జుట్టు రాలడం అనేది చాలా మంది ఎదుర్కునే సాధారణ సమస్య. అయితే అమ్మాయిలే దీనికి ఎక్కువ బాధితులుగా ఉంటారు. అలాగే జుట్టు రాలుతోందని ఆందోళన చెందేవారిలో కూడా అగ్రభాగం అమ్మాయిలే ఉంటారు. అయితే వాతావరణం, కేశ సంరక్షణ కోసం ఉపయోగించే ఉత్పత్తులు.. జీవనశైలి మొదలైనవి మాత్రమే కాకుండా తీసుకునే ఆహారం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. ఆహారంలో కొన్ని పోషకాలు లోపిస్తే జుట్టు బాగా రాలిపోతుందట. ఇంతకీ ఆ పోషకాలు ఏంటో తెలుసుకుంటే..
ఐరన్..
ఐరన్ అనేది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. మహిళలు ఐరన్ బాగా తీసుకోవాలని చెబుతారు. ఐరన్ లోపం ఉన్న మహిళలలో జుట్టు చాలా పలుచగా ఉంటుంది. అలాగే జుట్టు రాలిపోవడం, జుట్టు రాగి రంగులో ఉండటం వంటి సమస్యలు కూడా ఉంటాయి. ఐరన్ లోపం ఉంటే జుట్టు మూలాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా ఉండదు. అందుకే జుట్టు సమస్యలు వస్తాయి.
జింక్..
జింక్ కూడా శరీరానికి చాలా అవసరమైన ఖనిజం. ఇది శరీరంలో కణజాలాన్ని రిపేర్ చేయడానికి కణజాలం పెరుగుదలకు, కణజాలం ఆరోగ్యంగా ఉండటానికి చాలా సహాయపడుతుంది. జింక్ లోపిస్తే జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువ ఉంటుంది.
బయెటిన్..
బయోటిన్ జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యమైన పోషకం. బయోటిన్ ఆధారిత షాంపూలు, సీరమ్ లు, కండీషనర్లు మార్కెట్లో చాలా అందుబాటులో ఉంటాయి. బయోటిన్ లోపిస్తే జుట్టు పెళుసుగా మారుతుంది. తొందరగా విరిగిపోతుంది. జుట్టు బాగా రాలిపోతుంది.
ప్రోటీన్లు..
జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు కూడా చాలా ముఖ్యం. జుట్టు కెరాటిన్ తో తయారు అవుతుంది. ఇది ఒక రకమైన ప్రోటీన్. ఇవి లోపిస్తే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. తిరిగి జుట్టు పెరుగుదలలో ఎలాంటి మెరుగుదల కనిపించదు.
విటమిన్-ఇ..
విటమిన్-ఇ అనేది గొప్ప యాంటీ ఆక్సిడెంట్. ఇది తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని లోపం వల్ల జుట్టు రాలుతుంది. ఇప్పట్లో చాలా కేశ సంరక్షణ ఉత్పత్తులలో విటమిన్-ఇ చేర్చబడి ఉంటుంది. అప్పటికి ఈ విటమిన్-ఇ అనేది జుట్టుకు ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.
విటమిన్-డి..
విటమిన్-ఇ లాగానే విటమిన్-డికూడా జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యం. ఇది వెంట్రుకల కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే విటమిన్-డి లోపిస్తే కుదుళ్లు బలహీనపడతాయి. జుట్టు రాలడానికి కారణం అవుతుంది.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
*రూపశ్రీ.