ఈ మూడు ఆహారాలు తింటే చాలు.. బాడీ స్టామినా అదే పెరుగుద్ది..!
posted on Jan 24, 2025 @ 9:30AM
శరీరాన్ని కాపాడటంలో స్టామినాది చాలా ముఖ్యమైన పాత్ర. ఇది శరీరాన్ని తొందరగా అలసిపోకుండా చేయడంలో, పెద్ద పెద్ద పనులను సునాయాసంగా చేయడంలో, ఏదైనా శారీరక ఇబ్బంది ఏర్పడినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. కానీ స్టామినా తక్కువ ఉంటే శరీరం తొందరగా అలసిపోతుంది. బాగా నీరసంగా అనిపిస్తుంది. ఎప్పుడూ శరీరానికి ఏదో జబ్బు పడ్డట్టు ఉంటుంది. అయితే స్టామినాను పెంచుకోవడం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం మూడు ఆహారాలు తింటూ ఉంటే చాలు.. శరీర స్టామినా ఊహించని విధంగా పెరుగుతుందట. ఇంతకీ ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..
బాదం..
బాదం పప్పు స్టామినా పెరగడానికి బాగా సహాయపడుతుందట. బాదం పప్పులో ప్రోటీన్, విటమిన్-ఇ, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అమితమైన బలాన్ని ఇవ్వడమే కాకుండా శరీరం బరువు పెరగకుండా చేస్తుంది. మెదడుకు పదును పెడుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది.
అరటిపండ్లు..
అరటిపండ్లలో విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ఇందులో ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. రోజూ ఒక అరటిపండు అయినా తింటూ ఉంటే బాడీ స్టామినా అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాయామం చేసేవారు, ఫిట్ నెస్ ను తమ దినచర్యలో ఉంచుకునేవారు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు. అరటిపండ్లు డోపమైన అనే హార్మోన్ ను ప్రోత్సహిస్తాయి. ఇది అలసటను, పనిచేసేటప్పుడు నీరసం రాకుండా చేస్తుంది.
ఆకుపచ్చ ఆకుకూరలు..
ఆకుకూరలను ప్రతిరోజూ తీసుకునేవారి శరీర స్టామినా మెరుగ్గా ఉంటుంది. ఇది శరీరానికి శక్తి పెంచడంలో బాగా సహాయపడుతుంది. ఆకుకూరలలో విటమిన్-ఎ, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పాలకూర, మెంతికూర, మునగ ఆకు, బచ్చలికూర ఆహారంలో తీసుకోవడమే కాకుండా.. ఆకుకూరల జ్యూస్ కూడా తీసుకోవచ్చు.
*రూపశ్రీ.