మునుగోడులో కారు జోరు.. వాడిపోయిన కమలం!
posted on Nov 6, 2022 @ 5:11PM
మునుగోడు ఉప ఎన్నికల్లో కమలం వాడిపోయింది. కారో జోరు చూపింది. కమలనాథుల లెక్క తప్పింది. నియోకవర్గ ప్రజలు తెరాసకే బ్రహ్మరథం పట్టారు. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలపై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు.దీంతో తెలంగాణలోని టీఆర్ఎస్ కార్యాలయాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంలో నిలువగా.. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నిలిచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తంలో రెండు, మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ అధిక్యత ప్రదర్శించింది. ఆ తరువాత అన్ని రౌండ్లలోనూ కారు పార్టీ జోరు కొనసాగించింది. చివరకు విజయం తెరాస అభ్యర్థి కూసుకుంట్లనే వరించింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో మునుగోడు ఉప ఎన్నక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికను అటు అధికార టీఆర్ఎస్, ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ క్రమంలో మునుగోడులో సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన భారీ బహిరంగ సభను బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ సభ సాక్షిగా రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మరో వైపు అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం.. సదరు నియోజకవర్గాన్ని మొత్తం 86 యూనిట్లుగా విభజించి.. ఇన్‌చార్జులను నియమించారు. 14 మంది మంత్రులు, 72 మంది ఎమ్మెల్యేలకు ప్రచార భాద్యతలు అప్పగించడమే కాదు.. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లును సైతం గులాబీ బాస్ రంగంలోకి దింపారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ గడప గడపకు ప్రచారం నిర్వహించినట్లు అయింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాదే జరగనున్న తరుణంలో.. జరుగుతోన్నఈ ఉప ఎన్నికను సెమీ ఫైనల్స్‌గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అలాంటి తరుణంలో తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలు పోటా పోటీ పడి మరీ ప్రచారాన్ని నిర్వహించాయి.
మరోవైపు.. ఈ ఉప ఎన్నికకు కొద్ది రోజుల ముందు.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగోలుకు బీజేపీ తెర తీసిందంటూ.. కొన్ని వీడియోలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో జరిగిన హడావుడి ఓ రేంజ్‌లో సాగింది. అయితే ఇంకేముందు కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి.. కమలం పార్టీ నేతలను ఉతికి ఆరేస్తారని.. ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా పక్కాగా ఫిక్స్ అయిపోయారు. కానీ దీనిపై కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది లేదు. చివరకు మంత్రి కేటీఆర్ సైతం.. ఈ అంశంపై ఎవరు పెదవి విప్పవద్దంటూ గులాబీ గూటిలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు.
దీంతో మునుగోడు ప్రజలే కాదు.. ప్రపంచంలోని తెలుగు ప్రజలు సైతం మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ నిజమేనా?.. కాదా? అనే ఓ సందిగ్థంలోకి వెళ్లిపోయారనే ఓ టాక్ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా నడిచింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక జరిగిన నవంబర్ మూడో తేదీ సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి.. మొయినాబాద్ పామ్ హౌస్ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోను ప్రగతి భవన్ సాక్షిగా విడుదల చేశారు.
మరోవైపు మునుగోడు ఓటర్లంతా ఏ పార్టీ వైపు ఉన్నారనే చర్చ సైతం రాజకీయ పార్టీల్లో జోరుగా సాగింది. కానీ మునుగోడు ఓటర్లు మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే పట్టం కట్టినట్లు ఈ ఉప ఎన్నిక ఫలితం రూఢీ చేసింది. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి.. తమ సత్తా ఏమిటో గులాబీ బాస్ కేసీఆర్‌కు రుచి చూపిద్దామనుకున్న కమల నాథులు భంగపడ్డారు. ఈ ఉప ఎన్నిక ద్వారా సీఎం కేసీఆర్.. తెలంగాణ బీజేపీ నేతలకే కాదు.. హస్తినలోని మోదీ, అమిత్ షా ద్వయానికి సైతం ఝలక్ ఇచ్చారనే ఓ టాక్ అయితే తెలంగాణ భవన్ సాక్షిగా రచ్చ రంబోలా చేసి పారేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ జోడో యాత్ర సైతం.. ఈ ఉప ఎన్నికపై ప్రభావం చూపించలేదని.. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లను బట్టి అవగతమౌతోంది. ఈ ఉప ఎన్నికల వేళ అడుగడుగునా చెక్ పోస్ట్‌లు పెట్టడం ద్వారా భారీగా నోట్ల కట్టలే కాదు.. భారీగా మద్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. అయినా.. ఎప్పటిలాగానే ఈ ఉప ఎన్నికల్లో కూడా నగదు, మద్యంతోపాటు తులం బంగారం సైతం అత్యంత కీలక పాత్ర పోషించాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి.