కౌంటింగ్ పూర్తి కాకుండానే ఓటమి అంగీకరించిన రాజగోపాలరెడ్డి
posted on Nov 6, 2022 @ 4:17PM
మునుగోడులో రాజగోపాలరెడ్డి పరాజయాన్ని అంగీకరించారు. కౌంటింగ్ పూర్తి కాకుండానే.. ఆయన తన పరాజయాన్ని అంగీకరించారు. అదే సమయంలో టీఆర్ఎస్, వామపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
పది రౌండ్లు పూర్తయిన తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చి మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. అధికార పార్టీ విశృంఖలంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.బీజేపీ అభ్యర్థిగా తనను కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదని ఆరోపించారు.
టీఆర్ఎస్ అధర్మంగా గెలిచిందని అన్నారు. భారత దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయడం అనేది మునుగోడు ఉప ఎన్నికలోనే జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్, పోలీసులు వ్యవస్థ మొత్తం ప్రభుత్వ యంత్రాంగ మొత్తం నియోజకవర్గాన్ని అష్టదిగ్బంధం చేసిందన్నారు. పోలింగ్ రోజు కూడా డబ్బు మద్యం పంచారని ఆరోపించారు.