డేగ కళ్ల టీఆర్ ఎస్
posted on Oct 17, 2022 @ 11:49AM
ఎక్కడికి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న చిన్నదానా...అంటూ హీరోగారు తన నుంచి తప్పిం చుకోలేవని హీరోయిన్ని దాదాపు ప్రేమపూర్వకంగా బెదిరిస్తాడు.. అది సినిమా.. కానీ రాజకీయాల్లో అలాంటి డేగకళ్లతో టీఆర్ ఎస్ తమ పార్టీవారినే కాదు ఇతర పార్టీలవారినీ క్షణం రెప్పవేయకుండా గమనించా ల్సిన పరిస్థితి ఏర్పడింది..మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా!
అనుమానం తలెత్తగానే వేయి కళ్లు వెంటాడతాయంటారు. అదే పంథా అనుసరిస్తోంది టీఆర్ ఎస్. మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా పరిస్థితులను బేరీజు వేసుకోవడంతో పాటు పార్టీల ప్రతినిధులు, నాయకుల అడుగు జాడలను పసిగట్టే ప్రయత్నాల్లో పడింది. మునుగోడులు తప్పకుండా ఘన విజయం సాధిస్తా మన్న ఢంకా బజాయించిన టీఆర్ ఎస్ ఊహించనివిధంగా ఇపుడు అందరి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. కేవలం తమ పార్టీవారే గాకుండా ఎన్నిక దృష్ట్యా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ప్రతినిధులు, అభ్యర్థుల కదలికల మీదా ఓ న్నేసింది అనాలి.
భయంభయంగానే ధైర్యాన్ని ప్రకటించడంలో ఆరితేరిన లక్షణాలు టీఆర్ ఎస్ స్వయంగా ప్రకటించు కుంటోంది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న పట్టుదలతో పార్టీ పేరుని బీఆర్ ఎస్‌గా మార్చి మరీ ముందడుగు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి పెను సవాలుగా నిలవాలి, కేంద్రాన్ని భయపడేలా చేయాలన్నతలంపుతో దూసుకుపోవడానికి సర్వసన్నద్ధమయ్యారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో పార్టీని బలోపేతం చేయడంలోనూ దృష్టి పెట్టాలి గనుక ఇటు పార్టీ వర్గాలను, నిఘా సంస్థలను రంగంలోకి దింపారన్న ప్రచారం ఉంది. మునుగోడులో తిష్ట వేస్తున్న పార్టీలు, ప్రతినిధులు, వారి మద్దతుదారుల కదలికల్ని పనిగట్టుకుని పరిశీలిస్తున్నది టీఆర్ ఎస్. ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారన్నవే గాకుండా ప్రతీ చిన్న సమాచారం టీఆర్ ఎస్ వర్గా లు సేకరిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా పార్టీ అధినేతకు తెలిసే విధంగా సమాయత్తమయింది. అందు వల్ల టీఆర్ ఎస్ పార్టీ వర్గాలు మరింత జాగరూకతతో వ్యవహరిస్తున్నారు.
గెలవడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అందుకు అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ఈ విధమైన వ్యూ హాన్ని కూడా అమలు చేయడంలో దృష్టి పెట్టారు. మరీ ముఖ్యంగా బూర నర్సయ్య గౌడ్ టీఆర్ ఎస్ నుం చి బయటపడటంతో పార్టీ మరింత జాగ్రత్తపడాల్సిన అవసరం ఏర్పడింది. పడనివారిని ప్రతిపక్షాలు ఇట్టే ఆకట్టుకుంటాయన్నది అనాదిగా జరుగుతున్నదే. ఫిరాయింపులు ఎంత ధైర్యంగా ఉన్నా నీరుగారు స్తాయి. అదే భయం టీఆర్ఎస్‌కీ లేకపోలేదు. మునుగోడు ఉప ఎన్నిక కీలకంగా భావిస్తున్న ఈ తరు ణంలో ఫిరాయింపులు మరింత కంగారుపెట్టకపోవు. ఒక్కరిద్దరు మారి విపక్షాల్లోకి వెళ్లినా అవతలపార్టీకి ఏమాత్రం వారు బలం చేకూరుస్తారోగాని, ఇటు ఒక వికెట్ పడిపోయిందన్న బాధ మాత్రం లోలోపల ఉంటుంది. అందునా పేరున్న నాయకులు, వారి అభిమానులు, అనుయాయూలతో వెళిపోతే దాని ప్రభావం అమితంగా నే ఉంటుంది. అందుకనే టీఆర్ అధినేత కళ్లు డేగ కళ్టుగా మార్చుకున్నారు, నిఘావర్గాలను నిద్ర పోనీయడంలేదు, పార్టీ నాయకులను అందర్నీ పరుగులు పెట్టిస్తున్నారు.
అసలే పరిస్థితులు కొంత తీవ్రతరమయ్యాయి. లిక్కర్ కుంభకోణం మరీ భూతంగా మారిపోయి కేసీఆర్ కుటుంబాన్ని రోడ్డుమీదకు తెచ్చేట్టుగా మారింది. ఈ సమయంలో పార్టీ మునుగోడులో గెలిపించుకోవడం కష్టమే అయినప్పటికీ తీవ్రంగా కృషి చేస్తోంది. లిక్కర్ మరక ఇప్పట్లో తుడుచుకుంటే పోయేది కాదు. ఎన్నిక ముంగిట్లోకి వచ్చేసింది. ఇపుడు ప్రతిష్టను కాపాడుకునేందుకు ఈ ఎన్నికలో గెలిచి కాస్తంత ఊపిరి పీల్చకోవాలి. కనుకనే కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక విషయంలో డేగ దృష్టితోనే పరిస్ఙితులను గమనిస్తున్నారు, అందరినీ పరుగులెత్తిస్తున్నారు.