రాష్ట్ర విభజనకు జగన్ సంపూర్ణ మద్దతు పలికారా?
posted on Oct 17, 2022 @ 11:32AM
వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విశాఖ గర్జన తుస్సు మంది. డ్వాక్రా మహిళలు, వర్సిటీ విద్యార్థులను బెదరించి బలవంతంగా తీసుకువచ్చినా.. విశాఖ జనంలో స్పందన లేకపోవడంతో గర్జన శబ్దం కనీసంగా కూడా విశాఖలో వినిపించలేదు. చివరికి సభలో చెప్పుకోదగ్గ జనం కూడా లేకుండా పోయారు. ఇంతోటి దానికి ఇంత మంది మంత్రులు తరలి రావాలా అన్న వ్యాఖ్యలూ వినిపించాయి. సరే ఇదంతా పక్కన పెడితే.. విజయసాయి గర్జన్ లో అసలు కనిపించలేదు, వినిపించలేదు.
ఆయన ప్రమేయం ఇసుమంతైనా లేకుండానే వైసీపీ ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేసింది. వాస్తవానికి విశాఖ రాజధాని అయితే అందరి కంటే ఎక్కువగా లబ్ధి చేకూరేది విజయసాయికే. ఆ లబ్ధి కోసమే ఆయన ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిగా ఉన్న సమయంలో ఎడాపెడా భూ దందాలు చేశారు. అవన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో పార్టీ ఉద్దేశ పూర్వకంగానే ఆయనను విశాఖ బాధ్యతల నుంచి తప్పించిందంటారు. అందులో వాస్తవం ఎలా ఉన్నా.. విజయసాయి కుమార్తె, అల్లుడి ఖాతాలోకి విజయసాయి విజయవంతంగా చేర్చిన భూముల జాబితా మీడియా ముఖంగా సర్వే నంబర్లతో సహా వెలుగులోనికి వస్తుండటంతో ఆయన ఫేస్ విశాఖలో కనబడినా వైసీపీకి తీరని నష్టం జరుగుతుందని స్వయంగా జగనే భయపడుతున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే విజయసాయిని పార్టీ వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు చెబుతున్నారు. విశాఖ భూదందా, ఢిల్లీ లిక్కర్ స్కాం లింకులు అన్నీ విజయసాయి కేంద్రంగానే ఉండటంతో.. మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో జగన్ సతీమణి భారతి పేరు బయటకు రావడం వెనుకా విజయసాయి సెల్ఫ్ ప్రొటక్షన్ వ్యూహం ఉందని జగన్ అనుమానిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి భూదందా వ్యవహారాలన్నీ ఒకదాని వెనుక ఒకటి మీడియా ముఖంగా బయటపడుతున్నా... వైసీపీ బాకా ఉదే జగన్ సొంత పత్రికలో కనీసం ఖండనలు కూడా రాలేదని అంటున్నారు.
పార్టీ తనను దూరం పెడుతున్నదన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే విజయసాయి సొంత చానెల్ అంటూ ప్రకటించారనీ.. నిజానికి వైసీపీలో ఆయనకు మరింత ఉక్కపోత ఎదురైతే సొంత పార్టీ పెట్టేందుకు కూడా వెనుకాడరనీ అంటున్నారు. జగన్ ను ఢీ కొట్టేందుకు కూడా వెనుకాడని ధైర్యం విజయసాయికి రావడం వెనుక కమలం ఆశీస్సులున్నాయా అన్న అనుమానాలు సైతం వ్యక్త మౌతున్నాయి. బీజేపీ ఆశీస్సులు విజయసాయికి పుష్కలంగా ఉండటం వల్లనే ఇంత జరుగుతున్నా జగన్ ఆయనపై వేటు వేయడానికి కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు జారీ చేయడానికి కానీ వెనుకాడుతున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ విజయసాయిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అంటున్నారు. ఈ ధీమాతోనే.. రాహుల్ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించే తరుణంలో నాడు జగన్ రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయం వెల్లడయ్యేలా విజయసాయి కాంగ్రెస్ ను రెచ్చగొడుతూ ట్వీట్ చేశారని కూడా పరిశీలకులు అంటున్నారు. సరిగ్గా రాహుల్ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించే సమయంలో జగన్ రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారంటూ.. నాడు వైసీపీ తీర్మానం చేయడాన్ని... ఆ తీర్మానాన్ని అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు పంపుతూ వైసీపీ పంపిన లేఖను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాంరమేష్ ఇప్పుడు వెల్లడించడానికి కారణం విజయసాయి చేసిన ట్వీటే కారణం కావడం గమనార్హం.