వైసీపీ ప్రభుత్వ పనితీరుకు కేంద్ర మంత్రుల గుర్తింపు.. ఎందుకంటే?
posted on Oct 17, 2022 @ 11:47AM
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనా వైభోగాన్ని కేంద్ర మంత్రులు బాగా గుర్తించారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఇదేమిటి చంద్రబాబు ఏమిటి.. జగన్ పాలనకు బ్రహ్మాండంగా కేంద్రం నుంచి గుర్తింపు వచ్చిందని ట్వీట్ చేయడమేమిటని అనుకుంటున్నారా? నిజమే కేంద్రం జగన్ పాలనను గుర్తించిందనీ, అయితే బ్రహ్మాండంగా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందనీ, అవార్డుల మీద అవార్డులు వచ్చేస్తున్నాయనీ, ప్రజాదరణ రోజు రోజుకూ అద్భుతంగా పెరిగిపోతోందనీ కాదు.. వరుస వైఫల్యాలతో ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసేలా ఏపీలో జగన్ పాలన ఉందన్న విషయాన్ని కేంద్ర మంత్రులు గుర్తించారని చంద్రబాబు సెటైర్ వేశారు.
ఇంత అధ్వానంగా పాలన సాగుతున్న రాష్ట్రం దేశంలో మరోటి లేదన్న గుర్తింపు జగన్ సర్కార్ కు బాగా వచ్చిందన్నారు. గత మూడేళ్లుగా ఏపీలో పాలన అధమంగా ఉందనీ, సీఎం మాటలు కోటలు దాటుతున్నాయే కానీ.. రాష్ట్ర ప్రజలు రోడ్డు దాటలేక అవస్థలు పడుతున్నారనీ చంద్రబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇంతటి అధ్వాన పాలనతో జగన్ కేంద్ర మంత్రుల గుర్తింపు పొందారని అన్నారు. వచ్చే ఎన్నికలలో 175 కు 175 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించాలంటున్న జగన్ ఈ మూడేళ్లలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమిటో ఒక సారి అవలోకనం చేసుకోవాలన్నారు. ఇంతటి అధ్వాన పాలన అందించినందుకు సిగ్గు పడాలని చంద్రబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.