మునుగోడులో బీఆర్ఎస్సా టీఆర్ఎస్సా?
posted on Oct 5, 2022 @ 9:41AM
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 14న నామినేషన్ల దాఖలుకు తుది గడువు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత దృష్టి అంతా తాను విజయదశమి నాడు ( అక్టోబర్ 5) ప్రారంభించబోతున్న జాతీయ పార్టీ పైనే ఉంది. చాలా ఆర్భాటంగా, హడావుడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మునుగోడుపై ఆయన దృష్టి సారించారా? అంటే టీఆర్ఎస్ శ్రేణుల నుంచే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మరో వైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమతమ అభ్యర్థులను ఖరారు చేసి ప్రచార పర్వంలోకి దిగిపోయాయి.
వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమని తేలిన తరువాత మొట్టమొదటిగా మునుగోడులో సభ పెట్టి ప్రచార శంఖారావం మోగించింది కేసీఆర్. అయితే ఆ తరువాత క్రమంగా మునుగోడు కంటే జాతీయ రాజకీయాలపైనే ఆయన ఎక్కవగా దృష్టి పెట్టారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా పార్టీలో అసమ్మతి భగ్గుమనడంతో.. ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. ఒకవైపు టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించే ప్రక్రియలో బిజీబిజీగా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు మునుగోడులో నిలబెట్టబోయే అభ్యర్థి బీఆర్ఎస్ తరఫున నిలబడతారా, టీఆర్ఎస్ తరఫున నిలబడతారా అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి.
నవంబర్ 3న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుంది. ఈనెల 14న నామినేషన్ల దాఖలుకు చివరితేదీ. కొత్తగా ఏర్పాటయ్యే బీఆర్ఎస్ కు ఆ లోగా కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరణ వస్తే, టీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ తరపున పోటీకి దిగే అవకాశాలే ఎక్కువ ఉన్నఉన్నాయి.
తెరాస స్థానంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పు నిర్ణయంపై చేసిన తీర్మానం ప్రతితో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పార్టీ తెలంగాణ భవన్ కార్యాలయ ఇన్ ఛార్జి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా లోపు ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వారు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే ఇక టీఆర్ఎష్ కాదు బీఆర్ఎస్ పోటీలో ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలోని జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఎదుర్కొనే తొలి పరీక్ష ఇదే కానుంది. తొలి పరీక్షలో విజయం సాధించి శుభారంభం చేయాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.