అన్నయ్య ఆశీస్సులతో అధికారంలోకి తమ్ముడు.. మెగా బ్రదర్ నాగబాబు
posted on Oct 5, 2022 8:43AM
అన్నయ్య చిరంజీవి మద్దతు తమ్ముడు పవన్ కల్యాణ్ కే అని చెప్పారు మెగా బ్రదర్ నాగబాబు. తమ్ముడికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారని నాగబాబు అన్నారు. గాడ్ ఫాదర్ ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి మంగళవారం (అక్టోబర్ 4)న మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కే తన మద్దతు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ చిత్తశుద్ధి, నిబద్ధత తనకు చిన్నప్పటి నుంచీ తెలుసునన్న చిరంజీవి.. అటువంటి వాడు రాజకీయాలలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.
ప్రజలే పవన్ స్థాయిని నిర్ణయిస్తారన్న చిరు.. పవన్ భవిష్యత్ లో అధికారం చేపడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పవన్ కు మేలు జరుగుతుందనే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని కూడా చెప్పారు. చిరు వ్యాఖ్యలపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు.. అన్నయ్య మాటలనే రిపీట్ చేశారు.
అన్నయ్య ఆశీస్సులతో పవన్ కల్యాణ్ అధికారం చేపడతారని చెప్పారు. అన్నయ్య చిరంజీవి మాటలు కోట్లాది మంది తమ్ముళ్ల మనస్సులను గెలుచుకున్నాయన్నారు. కాగా చిరంజీవి పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించడం పట్ల జనసైనికులలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తున్నాయి. అటు పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.