ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా
posted on Mar 29, 2021 8:42AM
తెలంగాణలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. వారం రోజులుగా ఉదృతం అవుతోంది. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. "టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను." అంటూ వాణిదేవి వెల్లడించారు. ఇటీవలే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభి వాణిదేవి విజయం సాధించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె విస్తృతంగా తిరిగారు. సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా సుదీర్ఘంగా నాలుగు రోజుల పాటు సాగింది. లెక్కింపు సందర్భంగా వాణిదేవీ కూడా కౌంటింగ్ హాల్ లో ఉన్నారు. ఇక ఎన్నికల కౌంటింగ్ లో పాల్గొన్న సిబ్బందిలో చాలా మందికి కరోనా సోకింది. రోజు రోజుకు వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో కౌంటింగ్ హాల్ కరోనా వ్యాప్తి చెందిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాణిదేవీ ఇటీవల శాసనమండలి సమావేశాలకు కూడా హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్సీలంతా కరోనా టెస్టులు చేయించుకున్నారు.