ఎన్టీవోడి సంచలనం.. 1982లో ఏం జరిగింది?
posted on Mar 29, 2021 @ 10:35AM
తెలుగు దేశం పార్టీ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సాక్షి. దేశాన్ని ఏకపక్షంగా పాలిస్తూ రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా పురుడుపోసుకుని సంచలనం స్పష్టించిన పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని నినాదంతో పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు, కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం. ప్రతిసారి ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఎన్టీఆర్ సాగించిన ప్రచారానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
తారకరామారావు రాజకీయ అరంగ్రేటం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రభంజనం అయితే.. తర్వాత ఆయన కేంద్రంగా సాగిన రాజకీయ ప్రస్థానం కూడా సంచలనమే. ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెస్ ఘోరపరాజయం పాలై..కలగూరగంపగా ముద్ర పడిన జనతా పార్టీ విఫలమై తిరిగి ఇందిరాగాంధీ ప్రధాని అయిన రోజులవి. కాంగ్రెస్ వ్యతిరేకత నరనరాన జీర్ణించుకుని .. కడియం నియోజకవర్గం జనతాపార్టీ తరుపున గెలిపించుకున్న అమ్మిరాజు కాంగ్రెస్ లో చేరిపోయిన సమయం. కాంగ్రెస్ పై ఆంధ్రా జనాలు కసిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నారనే వార్త ప్రకంపనలు స్పష్టించింది. జనాలు చర్చించుకుంటుండగానే 1982 మార్చి 29న పార్టీని ప్రకటించారు తారకరామారావు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఎన్టీఆర్ చైతన్యరధం బయలుదేరగానే.. తెలుగు దేశం పార్టీకి బ్రహ్మరథం మొదలైంది. పల్లెలన్నీ ఆయన వెంట కదిలిపోయాయి. ఎన్టీఆర్ ఎక్కడికెళ్లినా జనసందోహమే. ఇసుక వేస్తే రాలనంతా జనమే. గ్రామాలు గ్రామాలే ఆయనకు జై కొట్టాయి. ముందు లీడర్లెవరు ఆయనకు మద్దతుగా నిలవలేదు. రాజమండ్రిలో గోరంట్ల రాజేంద్రప్రసాద్ తమ్ముడు పార్టీ జెండా కట్టారు. కడియం వడ్డి వీరభద్రరావు సభ్యత్వ పుస్తకాలు పట్టుకుని రాజ్ దూత్ బండి మీద తిరిగారు. బూరుగుపూడి పెందుర్తిసాంబశివరావు పార్టీ జెండా ఎత్తారు. ఇలా ఒక్కొక్కరు అన్నగారికి తోడయ్యారు. మండు వేసవిలో అన్నగారి పర్యటన సాగుతున్నా.. జనజాతర ఆగలేదు. ఆయన ప్రత్యర్ధులు మాత్రం సినిమా ఆకర్షణగానే భావించారు .. అలాగే వ్యాఖ్యానించేవారు. వేషాలు వేసుకునేవాళ్లకు ఓట్లు పడతాయా అంటూ అవహేళన చేశారు. ఎన్టీఆర్ పర్యటనకు ఆటంకాలు కల్పించారు. వసతి దొరక్కుండా చూసేవారు. అయినా అన్నగారి జోరు తగ్గలేదు. అప్పడు ఏ బండికి చూసినా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా స్టిక్కర్లే. వేలాది మంది కార్యకర్యలే సొంత డబ్బులతో జెండాలు కొని మోసారు.
చైతన్య రథంపై నుంచి ఖాకీ డ్రెస్ లో ఎన్టీఆర్ మాటల తూటాలు..ఉర్రూతలూగించే ప్రసంగాలకు జనాలు ఫిదా అయ్యారు. చైతన్యరధయాత్ర సాగుతుండగానే ఎన్నికలు వచ్చేసాయి. కొంత మందిని ఎన్టీఆర్ పిలిచి టిక్కెట్లు ఇస్తానంటే.. వద్దని కాంగ్రెస్ తరుపున నిలిచారు. అలాంటి వారిలో నీరుకొండ నారయ్య చౌదరి..రాయవరం మునసబు ఉండవల్లి సత్యనారాయణమూర్తి లాంటి నేతలు ఉన్నారు. ఎన్నికలు ముగిశాయి. అయినా కాంగ్రెస్ నేతలకు దింపుడు కళ్ళం ఆశ చావలేదు. సినీ గ్లామరుకి ఓట్లు పడవని వారికి నమ్మకం. అమ్మ బొమ్మకే ఓటేస్తారని వాళ్ల విశ్వాసం.
కౌంటింగ్ మొదలైంది. సాయంత్రం మొదటి ఫలితం షాద్ నగర్... కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహంగా ఉన్నారు. రేడియో వార్తల్లో ఫలితాల సరళి వెల్లడవుతున్నది. ఒక్కో జిల్లా వారీగా వరుసగా ఆధిక్యతలు చెబుతూ వస్తున్నారు. జిల్లాలకు జిల్లాలు తుడుచిపెట్టుకుపోయాయి. ఎన్టీవోడి దెబ్బకు వేళ్ళూనుకున్న కాంగ్రెస్ మహావృక్షాలు కూలిపోయాయి. ఒక్కో నియోజక వర్గం ఆధిక్యతలు చెబుతుంటే జనం స్పందన జేజేలు..ప్రత్యర్ధుల హాహాకారాలు..ఆర్తనాదాలు. ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ...ఈ రీతి విజయాన్ని వారు ఊహించలేదు. దాదాపు అర్ధరాత్రికే మూడింట రెండొంతులు పైగా స్దానాలు కైవసం చేసుకుంది తెలుగు దేశం పార్టీ. డాక్టర్లు..ఇంజినీర్లు.. లాయర్లు..పట్టభద్రులు.. బడుగుబలహీన వర్గాలకు చెందిన కొత్తరక్తం రాజకీయాల్లో అరంగేట్రం చేసారు. ఆంధ్రప్రదేశ్ ఫలితం అప్పుడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం. లెక్కింపు మొత్తం పూర్తయ్యేసరికి తెలుగు దేశ పార్టీ 202 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది.
ఎన్టీఆర్ ప్రభంజనంతో కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది పాట రేడియోలో వేశారు. అన్నగారి పాటలతో హోరెత్తించారు. వేషాలు వేసుకునేవాడంటూ హేళన చేసిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏపీ ఫలితాలు చూసి షాకయ్యారు. 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నందమూరి తారకరామారావు. దీంతో తెలుగురాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తో నవశకం ప్రారంభమయింది.బడుగుబలహీన వర్గాల వేదికయింది. తెలుగు వాడి ఆత్మగౌరవానికి..ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయింది. ఇప్పటి లాగే అప్పుడు కూడా విషపుత్రికలు అబద్దపు పత్రికలు ఉండేవి. దాదాపు అన్ని పత్రికలు..ప్రధాన శీర్షికలు..తెలుగుదేశం ప్రభంజనం..తెలుగుదేశం సూపరు హిట్టు అని పెడితే..ఒకటి రెండు పత్రికలు..ఇంకా లెక్కింపు కొనసాగుతున్నట్టు.. టీడీపి ఘనవిజయాన్ని తక్కువ చేసి చూపించటానికి ప్రయత్నం చేసారు.
1982లో ఎన్టీఆర్ తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని "ఇందిరా గాంధీ" హేళనకు గట్టి జవాబు చెప్పారు. ఏకంగా 202 అసెంబ్లీలో స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది తెలుగు దేశం పార్టీ. 1983లో దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. అప్పటి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షమయింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాకర్షక పథకాలతో జనాల గుండెల్లో చోటు సంపాదించారు నందమూరి తారక రామారావు. ఆయన ప్రవేశపెట్టిన కిలోబియ్యం రెండు రూపాయల పధకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికే ప్రజలు రెండు రూపాయల కిలోబియ్యం పథకం గురించి మాట్లాడుకుంటూ అన్నగారిని స్మరించుకుంటున్నారంటే.. ఆ స్కీమ్ ఎంతగా పాపులర్ అయిందో ఊహించవచ్చు. పేదల కోసం కూడు, గుడ్డ, గూడు నినాదంతో పాలన సాగించారు ఎన్టీఆర్. వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా.. తన సంక్షేమ పాలతో పేద ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించారు రామారావు.
"మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం ఎన్.టి.ఆర్.కు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్ పదవిని ఇందిరాగాంధీ సాయంతో లాక్కున్నారు. ఆరోగ్య కారణాలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో తన ఏమ్మెల్యే లతో ఢిల్లీలో నిరసన తెలిపారు.తెలుగువారి పౌరుషాన్ని చూపించారు. ఎన్టీఆర్ పోరాటంతో చేసేది లేక తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి గా చేసింది ఇందిరాగాంధీ. కానీ ఎన్టీఆర్ 1984 లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి తన సత్తా ఏంటో ఇందిరాగాంధీకి చూపించారు. రెండవ సారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు.
1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది. అయినా కుంగిపోకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు రామారావు. దేశంలోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా "నేషనల్ ఫ్రంట్" కూటమిని స్థాపించారు. కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు. "నేషనల్ ఫ్రంట్"కు చైర్మెన్ గా వ్యవహరించారు ఎన్టీఆర్. 1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
రాజకీయాల్లో మొదటి నుంచి చివరి వరకు ఎన్టీఆర్ ఒక సంచలనం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో ఏదో ఒక కీలక అంశం ఉండేది. నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకుంటారని పేరున్న ఆయన ప్రధాని చరణ్ సింగ్ తర్వాత కీలకం. మూడో ఫ్రంట్ లోనూ టీడీపీ కీలకంగా వ్యవహరించింది. మొత్తం ఫ్రంట్ కు కన్వీనర్గా ఎన్టీరామారావు వ్యవహరించారు. దేశ రాజకీయాల్లో కి వెళ్తారు అనుకున్న ఎన్టీఆర్ 1994లో వచ్చిన ప్రభంజనంతో ఆయన ఖచ్చితంగా ప్రధాని అవుతారని మాట వినిపించింది.
రామారావు భార్యగా వచ్చిన లక్ష్మీపార్వతి.. పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో అప్పటి రెవిన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు.. రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో ఎన్.టి.రామారావుఅధికారం కోల్పోవలసి వచ్చింది. 1995వ సంవత్సరంలో ముఖ్యమంత్రి అధికారాన్నితీసుకున్న చంద్రబాబు 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సంవత్సరాల చరిత్ర సృష్టించాడు. తన పాలనలో హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చారు చంద్రబాబు. హైదరాబాద్ ను ప్రపంచ పఠంలో పెట్టారు.
స్వర్ధాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు చేసిన పాలనలో దేశ రాజకీయాల్లో చర్చగా మారింది. తన తొమ్మిదేండ్ల పాలనలో హైదరాబాద్ రూపురేఖలే మార్చేశారు చంద్రబాబు. 1999లో 29 ఎంపీ స్ఠానాలు గెలిచిన తెలుగు దేశం పార్టీ.. పార్లెమంట్ లో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తీసింది. చంద్రబాబు విజన్... అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచింది. చంద్రబాబు దార్శనికత, ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అయువుపట్టుగా మారాయి. చంద్రబాబు విజన్ వల్లే తెలంగాణ ప్రస్తుతం ధనిక రాష్ట్రంగా నిలిచిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.