తీన్మార్ మల్లన్నతో కొండా కొత్త పార్టీ!
posted on Mar 29, 2021 8:42AM
తెలంగాణలో కొత్త పార్టీల సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది. పార్టీ ఏర్పాట్లలో ఆమె చాలా దూకుడుగా వెళుతున్నారు. షర్మిల పార్టీతో పాటు మరికొన్ని కొత్త పార్టీలు వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంచలన కామెంట్లతో టీఆర్ఎస్ నాయకత్వానికి టెన్షన్ పుట్టిస్తున్న మంత్రి ఈటల రాజేందర్.. బీసీ అజెండాతో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే చర్చ సాగుతోంది. పీసీసీ ఇవ్వకపోతే ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెడతారనే కొందరు చెబుతున్నారు. తన యూట్యాబ్ ఛానెల్ ద్వారా కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నిస్తూ ప్రజల్లో మంచి ఫాలోయింగ్ సంపాందించిన తీన్మార్ మల్లన్న కూడా కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
తాజాగా కాంగ్రెస్ కు ఇటీవలే రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మరో బాంబ్ పేల్చారు. తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రంలో మరో పార్టీ రావాలని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా, బలమైన ప్రతిపక్షంగా ఉండలేకపోతోందన్నారు. దీని వల్లే చాలా మంది నాయకులు అమ్ముడు పోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వివిధ పార్టీల నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. బీజేపీలో చేరాలా?లేదా కొత్త పార్టీ పెట్టాలా? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా? అనేది త్వరలో నిర్ణయించుకుంటానని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.
కొండా కామెంట్లతో ఆయన కూడా కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించిన తీన్మార్ మల్లన్నతో కొండా టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. తీన్మార్ మల్లన్నతో పాటు టీజేఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ తోనూ ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. కోదండరామ్, తీన్మార్ మల్లన్నతో కలిసి కొత్త కూటమి పెట్టేందుకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సీరియస్ గానే వర్కవుట్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాన్యుడిగా పోటీ చేసి విజయం అంచు వరకు వెళ్లారు తీన్మార్ మల్లన్న.
ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత తీన్మార్ మల్లన్న క్రేజ్ మరింత పెరిగింది. కోదండరామ్ కూడా భారీగానే ఓట్లు సాధించారు. దీంతో ప్రశ్నించే గొంతుకలకు తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉందని భావిస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ... వాళ్లతో కలిసి కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఆదివారం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన తీన్మార్ మల్లన్న.. రాష్ట్రంలో 6 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్న పేరిట కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఉంటాయని తీన్మార్ మల్లన్న వెల్లడించారు. తీన్మార్ మలన్న భవిష్యత్ కార్యాచరణతో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేయడమంటే కొత్త పార్టీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నట్లేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మీడియాతో మాట్లాడిన తీన్మార్ మల్లన్న... టీఆర్ఎస్ సర్కార్ పై యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ను గద్దే దింపేవరకు విశ్రమించబోనని చెప్పారు. సామాన్యుడు సీఎం సీటులో కూర్చోవడమే తన లక్ష్యమన్నారు. దీంతో తీన్మార్ మల్లన్న కేంద్రంగానే కొత్త పార్టీ రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు టీఆర్ఎస్ నేతలపైనా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు తనకు ఇష్టమైన నేతలు అన్నారు. తక్కువ మాట్లాడతారు... ఎక్కువ వింటారని చెప్పుకొచ్చారు. ఈటలను కలిసి మాట్లాడాలనుకుంటున్నానని, అపాయింట్‌మెంట్ కూడా అడిగానని కొండా చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పై ఈటల ఒక్కోసారి అలుగుతారు.. మరోసారి దోస్తీ చేస్తున్నారని చెప్పారు. అది కనుక్కుందామనే... ఆయనతో భేటీకి ప్లాన్ చేసినట్టు చెప్పారు. నిజంగా బయటకు వచ్చేది ఉంటే వచ్చేయండని చెబుతానన్నారు. ఈటల సొంత పార్టీ ఏర్పాటు చేస్తే గొప్ప నాయకుడు అవుతాడని కొండా జోస్యం చెప్పారు. దీంతో మంత్రి ఈటెలతోనూ కొండా సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. తాను అనుకుంటన్న కూటమిలోకి ఈటల కూడా వస్తే.. మరింత పవర్ ఫుల్ అవుతుందనే యోచనలో కొండా ఉన్నారని చెబుతున్నారు.