Read more!

శేరిలింగంపల్లిలో తెరాసలీలలు!

 

 

 

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ ఆడిన డ్రామా ప్రత్యర్థి పార్టీలను మాత్రమే కాకుండా టీఆర్ఎస్ నాయకులను కూడా బితరపోయేలా చేసింది. సీట్ల కేటాయింపులో ఈరకం నాటకాలు కూడా ఆడవచ్చా, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఈ టైపులో జెల్ల కొట్టవచ్చా అని ఈ నియోజకవర్గంలోని రాజకీయ వర్గాలు నోళ్ళు నొక్కుకుంటున్నాయి.


ఈ నియోజవర్గంలో తెరాసలీలల గురించి చెప్పాలంటే, టీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర్నుంచీ శేరిలింగంపల్లి నియోజకవర్గం బాధ్యతలను కొండకల్ శంకర్‌గౌడ్ అనే నాయకులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి నుంచి పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కోట్లకు కోట్లు డబ్బు ఖర్చుపెట్టారు. ఈసారి ఎన్నికలలో శంకర్‌గౌడ్‌కి టీఆర్ఎస్ టిక్కెట్ ఖాయమని అందరూ అనుకున్నారు.

అందరూ అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ శంకర్‌గౌడ్‌కి టిక్కెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ విషయం తెలిసిన కొండకల్ శంకర్‌గౌడ్ సంబరాలు చేసుకున్నారు. పార్టీకి తాను చేసిన సేవకి గుర్తింపు లభించిందని సంతోషించారు. అయితే ఆ తర్వాత తెలిసిన న్యూస్ విని బిత్తరపోయారు. టీఆర్ఎస్ శేరిలింగంపల్లి టిక్కెట్ శంకర్‌గౌడ్‌కే ఇచ్చింది. కానీ పార్టీకి పన్నెండేళ్ళుగా సేవ చేసిన కొండకల్ శంకర్‌గౌడ్‌కి కాదు.. నిన్నగాక మొన్న టీఆర్ఎస్‌లో చేరిన తెలుగుదేశం నాయకుడు కొమరగాని శంకర్‌గౌడ్‌కి!  ఈ విషయం తెలిసి కొండకల్ శంకర్‌గౌడ్ గుండెలో  మండిపోతోంది.