గోరంట్ల మాధవ్ మళ్లీ దొరికిపోయాడు!
posted on Nov 8, 2022 @ 10:14PM
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మళ్లీ అడ్డంగా దొరికిపోయారు. ఈ సారి రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఆయన ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదని.. పోని ఇల్లు ఖాళీ చేయమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ ఇంటి ఓనర్ మల్లిఖార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 36 నెలలుగా అంటే మూడేళ్లుగాఇంటి అద్దె చెల్లించడంలేదనీ, అది దాదాపు36 లక్షల రూపాయిలనీ, అలాగే దాదాపు రెండు లక్షల రూపాయలకు పైగా విద్యుత్ బకాయి ఉందని చెల్లించలేదని.. అలాగే కరెంట్ బిల్లు దాదాపు రెండు లక్షల రూపాయిలకు పైగా బకాయి ఉందని.. ఇంటి ఓనర్ మల్లికార్జునరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డిసెంబర్ లో తమ ఇంట్లో వివాహ వేడుక ఉందని.. ఈ నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలని కోరగా.. తన సిబ్బందితో గోరంట్ల మాధవ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన... ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ నివాసం ఎదుట.. ఇంటి ఓనర్ మల్లిఖార్జునరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగేందుకు సమాయత్తమవుతోండగా.. ఈ విషయం తెలుసుకోన్న ఎంపీ గోరంట్ల .. వెంటనే పట్టణంలోని వివిధ పోలీసు అధికారులను రంగంలోకి దింపి.. వారి వద్దకు రాయబారానికి పంపి చర్చించారని అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇంటి ఓనర్ మల్లికార్జునరెడ్డి ఇళ్లు ఖాళీ చేయాల్సిందే, అద్దె చెల్లించాల్సిందే, విద్యుత్ బకాయిలు కట్టాల్సిందే అని కచ్చితంగా చెప్పడంతో చర్చలు అసంపూర్తిగా మిగిలాయని తెలుస్తోంది.
మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియో తనది కాదంటూ ఆయన మీడియా సాక్షిగా స్పష్టం చేశారు. కానీ ఎంపీ గోరంట్ల వీడియో వ్యవహారంపై పలువురు నేతలు.. లోక్‌సభ స్పీకర్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్, ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. ఆ వీడియో నిజమైనదా? కాదా? అనే అంశాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చాలంటూ మహిళా కమిషన్ జిల్లా ఎస్పీకి ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్ సైలెంట్ కావడంతో.. ఈ వ్యవహారం మరుగున పడిపోయింది. తాజాగా మళ్లీ ఎంపీ గోరంట్ల మాధవ్ ..తనదైన శైలీలో ఇంటి ఓనర్‌పై బెదిరింపులకు దిగడం.. హిందూపురం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది
గతంలో సీఐగా విధులు నిర్వహించిన గోరంట్ల మాధవ్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2019 ఎన్నికలకు మందు జగన్ పార్టీలో చేరారు. ఆయనకు వెంటనే హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్. ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలుపొంది... లోక్‌సభలో అడుగు పెట్టారు. అయితే గతంలో ఆయన పోలీస్ శాఖలో విధులు నిర్వహించినప్పుడు.. పలు వివాదాల్లో చిక్కుకున్నారు.... ఆ క్రమంలో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయనే ఓ టాక్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేటికీ ఉంది.
అయితే గతంలో గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంశం రచ్చ రచ్చ కావడంతో ఆయనపై వేటు వేసేందుకు జగన్ సిద్దమయ్యరు. కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనపై వేటు వేస్తే.. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దూరమయ్యే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు వెనకడుగు వేశారని అప్పట్లో బాగా వినిపించింది. అదీకాక.. గోరంట్ల మాధవ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీగా ఉండటం, ఆ ఓట్లే. ఆయా జిల్లాల్లోని అభ్యర్థుల గెలుపొటములను చేస్తాయన్న భయంతోనే గోరంట్ల మాధవ్ పై చర్యలకు జగన్ వెనకడుగు వేసారని వైసీపీ శ్రేణులే అప్పట్లో చెప్పాయి. ఇప్పుడు మళ్లీ ఇంటె అద్దె ఎగ్గొట్టడమే కాకుండా, అద్దె అడిగిన ఇంటి ఓనర్ పై బెదరింపులకు దిగి వార్తల్లోకెక్కడంతో జగన్ ఏం చర్య తీసుకుంటారన్న చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది.