Read more!

ఎన్నికల బరిలో దూసుకుపోతున్న తెరాస

తెరాస కాంగ్రెస్,తెరాసల మధ్య పొత్తులు కుదరకపోవడంతో రెండు పార్టీలు తమ తమ అభ్యర్ధుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలలో మజ్లిస్, లోక్ సత్తా, ఆమాద్మీ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఆ మూడు పార్టీలు కూడా ఇప్పటికే తమ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసాయి. ఇక తెదేపా-బీజేపీల మధ్య నిన్న అర్ధరాత్రి వరకు ఎడతెగకుండా సాగిన చర్చలలో ఎట్టకేలకు వాటి మధ్య ఎన్నికల పొత్తులు కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. గనుక, ఇక ఆ రెండు పార్టీలు కూడా తమ తమ అభ్యర్ధుల జాబితాలను నేడో రేపో ప్రకటించితే, ఇక అన్ని పార్టీలు ఎన్నికల రణరంగానికి సిద్దమయిపోయినట్లే!

 

ప్రస్తుతం తెరాస అభ్యర్ధుల పేర్ల ఖరారు, ఎన్నికల మ్యానిఫెస్టో, ప్రచారంలో మిగిలిన అన్ని పార్టీల కంటే కూడా చాలా ముందంజలో ఉంది. ఇంతవరకు తెరాస ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్దుల జాబితాను పరిశీలించినట్లయితే, వారిలో చాలా మంది గెలుపు గుర్రాలేనని అర్ధమవుతుంది. తెరాస తెలంగాణా సెంటిమెంటు, తెలంగాణా సాధన, పునర్నిర్మాణం అనే మూడు అంశాలతో రేసు గుర్రంలా దూసుకుపోతోంది. కానీ నేడోరేపో కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కూడా తమ అభ్యర్ధులను ప్రకటిస్తే, వారితో పోల్చి చూసినప్పడు మాత్రమే తెరాస అభ్యర్ధుల అసలయిన బలాబలాలు తెలుస్తుంది.