Read more!

జగన్ని కలిసిన అశోక్ బాబు !

 

ఒకప్పుడు మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి కనుసన్నలలో పనిచేసిన ఏపీ యన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు, ఒకానొక సమయంలో ఎన్నికలలో పోటీ చేయాలని కూడా చాలా ఉవ్విళ్ళూరారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే ఆయన అందులో జేరి ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారని అందరూ భావించారు. నిజానికి అశోక్ బాబు, ఆయన వెనుకున్న ఉద్యోగ సంఘాలు, లక్షలాది ఉద్యోగస్తులు, వారి కుటుంబాల పూర్తి మద్దతు తనకే ఉంటుందనే భ్రమ కూడా కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించడానికి ఒక ప్రధాన కారణం. కానీ కిరణ్ పార్టీ పెట్టినప్పటికీ దానికి రాజకీయ నేతల నుండి కానీ, ప్రజల నుండి గానీ ఎటువంటి ఆదరణ లేకపోవడంతో అశోక్ బాబు కూడా మొహం చాటేశారు. ఆయన ఆ తరువాత చంద్రబాబు వైపు వెళ్లేందుకు కూడా చూసారు. కానీ ఎందువల్లో పొసగలేదు. ఈరోజు ఆయన తన ఉద్యోగ సంఘాల నేతలను వెంటబెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కలిసారు. అయితే అందుకు ఆయన చెపుతున్న కారణం నమ్మశక్యంగా లేదు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదులో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులకు తగిన భద్రత కల్పించేందుకు జగన్ కృషి చేయాలని, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపుతూ మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వాలని కోరేందుకే కలిసారుట. జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి ఉద్యోగుల మద్దతు కోరుతూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తాను కూడా వారిని తన తండ్రి లాగే భద్రంగా చూసుకొంటానని హామీ ఇచ్చారుట. ఇంతకీ అశోక్ బాబు చల్ల కొచ్చి ముంత దాచినట్లుగా తనకి టికెట్ ఇవ్వమని అడిగారో లేదో తెలియనే లేదు. కానీ ఆయన తరువాత చంద్రబాబుని, కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలనుకొంతున్నారుట! దేనికో..?