భారత్ జోడో యాత్రకు దీపావళి సెలవులు.. ఢిల్లీ వెళ్లిన రాహుల్
posted on Oct 24, 2022 @ 10:23AM
భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ స్వల్ప విరామం ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా యాత్రకు మూడు రోజుల విరామం ప్రకటించి హస్తినకు బయలు దేరి వెళ్లారు. అంతకు ముందు రాహుల్ గాంధీ కర్నాటకలోని రాయచూర్ జిల్లా ఎర్మారస్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించారు.
మక్తల్ కృష్ణా బ్రిడ్జి మీదుగా రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో తొలి రోజు యాత్ర నాలుగు కిలోమీటర్లు సాగింది.
అడుగడుగునా రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజ నీరాజనం పలికింది. వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులతో భారత్ జోడో యాత్ర కిక్కిరిసిపోయింది. నాలుగు కి.మీ. పాదయాత్ర చేసిన తర్వాత రాహుల్ గాంధీ తన పాదయాత్రకు విరామం ఇచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా పాదయాత్రకు మూడు రోజులు విరామం ప్రకటించి రాహుల్ గాంధీ మక్తల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరకుని అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
విరామం తరువాత పాదయాత్ర యథాతథంగా కొనసాగుతుంది. తెలంగాణలో రాహల్ భారత్ జోడో యాత్ర మొత్తం 12 రోజుల పాటు సాగుతుంది. రాష్ట్రంలో ఆయన 375 కిలో మీటర్లు నడుస్తారు. ఈ నెల 24, 25 , 26 తేదీల్లో పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఈ నెల 27 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించనున్నారు.