భళా ఇస్రో.. అంతరిక్షంలోకి ఒకే సారి 36 శాటిలైట్లు
posted on Oct 24, 2022 7:21AM
ఇస్రో ఖాతాలో మరో ఘనత చేరింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో జీఎస్ఎల్వీ రాకెట్ మొదటి సారిగా ఆరు టన్నుల పేలోడ్‌ను అంతరిక్షంలోనికి తీసుకు వెళ్లింది. ఎల్‌వీఎం3-ఎం2 రాకెట్ ద్వారా ఒకే సారి 36 శాటిలైట్లను అంతరిక్షంలో విజయవంతంగా ప్రయోగించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది.శనివారం(అక్టోబర్22) అర్థరాత్రి దాటిన తరువాత జీఎస్ఎల్‌వీ- మార్క్3 నిప్పులు చిమ్మతూ నింగిలోకి దూసుకెళ్లింది. అంతకు 24 గంటల ముందు ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
ఇస్రో రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లింది. వచ్చే ఏడాది మొదట్లో మరో 36 వన్‌వెబ్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంప నున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు.
భారత్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3లో ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం ఎన్ఎస్ఐఎల్, ఇస్రోలకు ఒక చారిత్రాత్మక క్షణం అని ఎన్ఎస్ఐఎల్ సీఎండీ రాధాకృష్ణన్ తెలిపారు.ఇస్రో ఈ ప్రయోగాన్ని కమర్షియల్ ఆపరేషన్‌గా చేపట్టింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎస్ఐఎల్) అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వన్‌వెబ్‌కు చెందిన 36 శాటిలైట్లను లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ప్రవేశపెట్టింది. ఒక్కో బ్యాచ్‌లో 4 ఉపగ్రహాల చొప్పున.. మొత్తం 9 బ్యాచ్‌లలో 36 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. ఒక్కో ఉపగ్రహం 142 కిలోల బరువు ఉంటుంది. కాగా ఇస్రో ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ప్రధాని మోడీ, మంత్రి నితిన్ గడ్కరీ అభినందించారు. ఈ మేరకు వేరువేరుగా చేసిన ట్వీట్లలో వారు ఇస్ట్రో ప్రయోగం విజయవంతం కావడం భారత్ కు గర్వకారణంగా పేర్కొన్నారు.