జగన్ ఫిజియోథెరపిస్టుకే తిరుపతి టికెట్
posted on Mar 16, 2021 @ 8:41PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ను వెన్నంటే ఉన్న డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ ఖరారు చేసినట్టు వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.తిరుపతి బరిలో డాక్టర్ గురుమూర్తిని దింపాలని కొన్నినెలల కిందటే వైసీపీలో అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడి చేశారు.
వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన మద్దిల గురుమూర్తి స్వస్థలం ఏర్పేడు మండలం మన్నసముద్రం. స్విమ్స్‌లో ఫిజియోథెరపీ పూర్తిచేసిన ఈయన తిరుపతిలోని శ్రీసాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏడేళ్లపాటు సీనియర్ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేశారు. ఈ క్రమంలో జగన్ సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’లో ఆమెకు వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌గా వ్యవహరించారు.దీంతో జగన్ పాదయాత్రలోనూ ఆయనకు ఫిజియోథెరఫిస్ట్‌గా పని చేసే అవకాశం లభించింది.ఈ సేవలకు ప్రతిఫలంగా తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు లభించినట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 16న మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. తిరుపతి సీటును 2019లో భారీ మెజార్టీతో గెలుచుకుంది వైసీపీ. బల్లి దుర్గాప్రసాద్ 2 లక్షల 40 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో దుర్గాప్రసాద్ కొడుకే పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినా... అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్. దీంతో తిరుపతిలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ఖరారు చేశారు.