సాగర్ జానారెడ్డికి సవాలే!
posted on Mar 17, 2021 7:54AM
ఉప ఎన్నికల నగారా మోగడంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక పార్టీలకు ప్రధాన సవాల్ గా మారింది.వరుస ఓటములతో డీలా పడిన అధికార పార్టీ ఇక్కడ గెలుపు అత్యంత కీలకం. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను సాగర్ లోనూ రిపీట్ చేయాలని తహతహలాడుతోంది కమలదళం. తమకు పట్టున నాగార్జున సాగర్ లో విజయం సాధించి తిరిగి ఫామ్ లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో ఉప ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాగార్జున సాగర్ కు అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని ఉప ఎన్నిక బరిలో నిలుపుతున్నట్లు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.గతంలో ఇక్కడి నుంచి ఏడుసార్లు విజయం సాధించారు జానా రెడ్డి. 2018 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. నాగార్జున సాగర్ నుంచి జానా రెడ్డి పోటీ చేస్తారని చాలా రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గంలో ఆయన ప్రచారం కూాడా చేసేస్తున్నారు. ఇప్పటికే జానారెడ్డి ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేసుకున్నారని చెబుతున్నారు. తన కంచకోటగా చెప్పుకునే సాగర్ లో గెలిచి రాష్ట్రంలో మళ్లీ సత్తా చాాటాలని జానారెడ్డి భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన సర్వశక్తులు ఒడ్డనున్నారు. నిజానికి సాగర్ లో జానారెడ్డి కొడుకు పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినా.. ఎన్నిక అత్యంత కీలకం కావడంతో జానారెడ్డినే పోటీ చేయాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య తిరుగులేని విజయం సాధించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ.. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు. 17న ఉప ఎన్నిక పోలింగ్, మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.