Read more!

ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా.. విరాళానికి మీ చెయ్యి ముందుకు రావాలి!

భారతదేశం నా మాతృ భూమి.. భారతీయులందరు నా సహోదరులు.. ఈ మాట చిన్నప్పటి నుండి కంఠస్థం చేసినదే. అయితే సగటు సాధారణ పౌరుడు ఇలాంటి ప్రతిజ్ఞలలోనూ, మేరా భారత్ మహాన్.. అనో..  భారత్ మాతా కీ జై.. అనో నినాదాలు ఇస్తూ పైపైకి దేశ భక్తి చాటుకుంటారు. దేశం కోసం ఎవరైనా సైనికులు వీర మరణం పొందితే ఇతనే నిజమైన సైనికుడు, దేశ భక్తుడు అంటూ కీర్తిస్తారు. తప్పితే సగటు పౌరుడు ఇంకేమీ చెయ్యలేడు. కానీ ప్రతి పౌరుడు దేశం మీద తమకున్న భక్తిని చాటుకోవడానికి, దేశానికి తనూ సహాయం చెయ్యడానికి ఫ్లాగ్ డే ఆప్ ఇండియా సరైన రోజు. అసలేంటీ ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా? దీని చరిత్ర ఏంటి? భారతదేశ పౌరులు దీని సందర్భంగా ఏం చెయ్యవచ్చు? వివరంగా తెలుసుకుంటే..

ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా..

భారత్ ను తమ ప్రాణాలను పణంగా పెట్టి సంరక్షిస్తున్న మన దేశ సూపర్ హీరోల సహాయార్థం ఈ ఫ్లాగ్ డే ఆప్ ఇండియాను జరుపుకుంటారు. దేశానికి సేవలు అందించే నౌకాదళం, వైమానిక దళం, భారత సైన్యంలోని సైనికుల కోసమే దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మూడు శాఖలలోని సైనికులు దేశం కోసం పోరాడుతూ మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడానికి, వారికి ఆర్థిక సహాయం చెయ్యడానికి  ఈరోజున భారత జండాతో పాటు ముదురు నీలం, లేత నీలం, ఎరుపు రంగులలో ఉన్న చిన్న జెండాలను అందజేస్తారు. వీటిని అందుకున్నవారు బదులుగా డబ్బును విరాళంగా ఇస్తారు. ఈ జెండాను దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తారు. ఈ డబ్బును సైనికుల కుటుంబాల కోసం వినియోగిస్తారు.

చరిత్రలో ఏముంది?

 ఇది 1949, ఆగస్టు 29న ప్రారంభమైంది. అప్పటి భారత రక్షణ మంత్రి ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన  జెండా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం జెండాలను పంపిణీ చేయడం ద్వారా నిధులు సేకరించి ఆ నిధులను  సైనికుల కుటుంబాలకు సహాయంగా ఇవ్వాలని నిర్ణయించబడింది.

భారత్ పౌరులు ఏం చేయవచ్చు..

ఈ నిధుల సేకరణ ముఖ్యంగా వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు సాధారణ పౌరులు బాధ్యత వహించే దిశగా సాగుతుంది. అమర వీరులకు, యుద్ద బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి కూడా ఈ నిధులు సేకరిస్తారు. భారత పౌరులు దేశంలో సురక్షితంగా జీవించడానికి దేశ సరిహద్దులలో సైనికుల  ధైర్యసాహసాలే కారణమని తెలుసుకోవాలి. ఇందుకోసం వారి కుటుంబాల పట్ల బాధ్యతగా ఉండాలి. తమకు తోచినంత మెరుగైన విరాళాలు ఇవ్వాలి. దేశానికి సైనికులు సేవ చేస్తే.. వారి కుటుంబాలకు అండగా ఉండగలమనే భరోసాను భారత పౌరులే  ఇవ్వాలి.

                                                        *నిశ్శబ్ద.