వ్యాపారాలు, ఆస్తుల కోసమేనా.. బీఆర్ఎస్ రాగం?
posted on Jan 3, 2023 @ 3:09PM
మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబులు సోమవారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వారికి బీఆర్ఎస్ ఏమీ రెడ్ కార్పెట్ పరిచి వెల్ కమ్ చెప్పలేదు. బలవంతపు బ్రాహ్మణార్దం అన్నట్లుగా పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ పంపిన కార్లలో వచ్చిన వీరు కేసీఆర్ చేత పార్టీ కండువా కప్పించుకోవడానికి దాదాపు నాలుగు గంటల పాటు తెలంగాణ భవన్ లో పడిగాపులు కాయాల్సి వచ్చింది.
ఔను ఏపీ నుంచి కేసఆర్ పంపిన కార్లలో ర్యాలీగా వచ్చిన వీరు తెలంగాణ భవన్ చేరుకుని బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి నాలుగు గంటల సేపు పడిగాపులు కాసారు. వీరు తెలంగాణ భవన్ చేరుకున్న నాలుగు గంటల తరువాత తీరిగ్గా కేసీఆర్ వచ్చి వీరికి బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పారు. సముచిత స్వాగతం లేకపోయినా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ కుమార్ తదితరులు బీఆర్ఎస్ గూటికి చేరడానికి ఎందుకు తహతహలాడారు? అంటే వారికి హైదరాబాద్ లో ఉన్న బాదరాయణ సంబంధాలే అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
హైదరాబాద్ లో ఉన్న వ్యాపారాలు, ఆస్తుల కారణంగానే ఒక విధంగా అనివార్యంగా వారు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు హైదరాబాద్ లో కనస్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఆదిత్య కనస్ట్రక్షన్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్యా హౌసింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఆదిత్యా ఇన్ఫ్రాటెక్, డెక్కన్ ఇండియా కార్పొరేషన్ తోట చంద్రశేఖర్ కు చెందినవే. ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నడుపుతున్నాయి. దీంతో ఆయన వీటి పరిరక్షణ విస్తరణ అవసరాల కోసమే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని అంటున్నారు.
అలాగే టీవీ 99 అనే చానల్ నడుపుతున్న ఈయన ఒక సమయంలో సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఇక మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు కూడా వికారా బాద్ లో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది. ఇలా తమ ఆస్తులు, వ్యాపారాల విషయంలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ గూటికి చేరారని చెబుతున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో రావెల పేషీలో ఒక నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు పీఏలు మారారంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో అవగతమౌతుంది. ఇటు తమ ఆస్తుల భద్రత, అటు ఏపీలో ఏదో మేరకు రాజకీయ ప్రాధాన్యత దక్కుతాయన్న ఉద్దేశంతోనే వీరు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఆసక్తి చూపారని అంటున్నారు.
అందుకే వీరి చేరికను బీఆర్ఎస్ పెద్ద సీరియస్ గా తీసుకోలేదని చెబుతున్నారు. వీరిని అడ్డు పెట్టుకుని ఏపీలో కాలూనవచ్చని భావించిన కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి కొన్ని బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. అటు ఏపీలో కూడా వీరు బీఆర్ఎస్ లో చేరడాన్ని అక్కడి రాజకీయ పార్టీలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అదీ గాక తోట చంద్రశేఖర్ ఏపీలో ఇప్పటి వరకూ మూడు పార్టీల తరఫున మూడు సార్లు ఎన్నికల బరిలోకి దిగి మూడు సార్లూ పరాజయం పాలయ్యారు. అలాగే రావెల కూడా తెలుగుదేశం హయాంలో మంత్రిగా పని చేసి ఆరోపణలు ఎదుర్కొని ఉద్వాసనకు గురయ్యారు. ఆ తరువాత జనసేనలో చేరి 2019 ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆ తరువాత వైసీపీ, తెలుగుదేశం పార్టీలలో చేరేందుకు విఫలయత్నం చేశారు. చివరికి బీఆర్ఎస్ గూటికి చేరారు.