సత్యం కవచం.. దేవుడు రక్ష
posted on Jan 3, 2023 @ 4:35PM
రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రతో ఇప్పటి వరకూ తనపై ఉన్న విమర్శలన్నిటికీ సమాధానం చెప్పేశారు. పప్పు అన్నారు. రాజకీయాలకు పనికి రాడన్నారు. ప్లే బోయ్ ముద్ర వేశారు. అన్నిటికీ మౌనమే సమాధానంగా ఆయన మాత్రం అడుగులు వేసుకుంటూ ముందుకు సాగారు. చివరికి ఇప్పుడు ఎలాంటి ఆశా లేని స్థితి నుంచి కాంగ్రెస్ కు మరో సారి దేశంలో అధికార పగ్గాలు దక్కే అవకాశాలున్నాయన్న ధీమాను తీసుకు వచ్చారు.
ఔను భారత్ జోడో యాత్ర రాహుల్ పై విపక్షాల్లోనే కాదు జనంలో ఇంత వరకూ ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. వణికించే చలి, కాల్చేసే ఎండ ఇలా వేటికీ వెరవకుండా ఒక దీక్షతో తన జోడో యాత్ర సాగిస్తున్నారు. యాత్ర సాగుతున్న సమయంలో వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలను ఆయన పట్టించుకోలేదు. పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతున్నా ఎక్కడా జోక్యం చేసుకోలేదు. పైగా పార్టీ అధ్యక్ష ఎన్నికలో తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయరనీ, పార్టీయే అధ్యక్షుడిని ఎన్నుకోవాలని స్వేచ్ఛ నిచ్చేశారు. ఫలితంగా దశాబ్దాల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది.
గెలుపు ఓటములను సమానంగా తీసుకునే స్థిత ప్రజ్ణత రాహుల్ లో కనిపించింది. జనంలో మమేకమౌతూ సాగుతుండటంతో ప్రజలు ఆయనను చూసే దృక్కోణమూ మారింది. యాత్ర సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆరు రోజుల విరామం తరువాత రాహుల్ మంగళవారం (జనవరి 2)న తిరిగి ప్రారంభమైంది. ఉత్తర ప్రదేశ్ చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ యాత్ర సందర్భంగా ధరించిన దుస్తులపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. ఉత్తర భారతాన్ని చలి వణికించేస్తోంది. అయినా రాహుల్ కనీసం స్వెట్టర్ కూడా ధరించడం లేదు.
దీనిపైనే ఆయన సోదరి ప్రియాంకను మీడియా ప్రశ్నించింది. ఆయన సరే పట్టించుకోవడం లేదు.. కనీసం మీ సోదరుడిపై మీకైనా శ్రద్ధ ఉండొద్దా? చలి నుంచి రక్షణకు కనీసం స్వెట్టరైనా వేసుకోమని సలహా ఇవ్వండి అని సూచించింది. అయితే ప్రియాంక చిన్న చిరునవ్వుతో ఆ ప్రశ్నకు రాహుల్ కు సత్యమే కవచం, దేవుడే రక్ష అని బదులిచ్చారు.
ఇదే ప్రశ్నకు రాహుల్ మరింత హృద్యంగా బదులిచ్చాడు. ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారు సరే.. మరి రైతులూ, కూలీలు, పేద పిల్లలను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. అయితే విపక్షాల విమర్శలకు తావీయరాదన్న ఉద్దేశంతో రాహుల్ యాత్ర ఆరంభంలో ధరించిన బ్రాండెడ్ టీ షర్టును వదిలేశారు. మామూలు నాన్ బ్రాండెట్ టీషర్ట్ మాత్రమే వేసుకుంటున్నాడు. రాహుల్ జోడో యాత్ర మరో రెండురోజుల్లో హర్యానా చేరుకుంటుంది.