జగన్ సభలో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు
posted on Jan 3, 2023 @ 1:29PM
రాజమండ్రిలో జరిగిన ముఖ్యమంత్రి జగన్ బహిరంగసభలో అపశ్రుతి చోటు చేసుకుంది. వృద్ధులకు ఈ నెల నుంచి రూ. 250 పెన్షన్ పెంచినందున వారితో ముఖా ముఖి కార్యక్రమాన్ని రాజమండ్రిలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెన్షన్లు పొందుతున్న వృద్ధులను వాలంటీర్లు సభకు తీసుకు వచ్చారు. చాలా మంది 70 ఏళ్లు పైబడిన వాళ్లు కావడం.. బస్సులు ఎక్కి , దిగలేని ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లు రాలేమన్నా కూడా వాలంటీర్లు అంగీకరించలేదు.రాకుంటే పెన్షన్లు ఆపేస్తామని హెచ్చరించి మరీ బలవంతంగా తీసుకు వచ్చారు.
ఇలా తీసుకువచ్చిన ఓ 70 ఏళ్ళు పైబడిన ఓ వృద్ధురాలు జారిపడిపోయింది. రోడ్డు మీద పడిపోవడంతో.. వెంటనే పక్కన వేరే వాహనం ఆ వృద్ధురాలు కాళ్లు మీదకు ఎక్కింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన బహిరంగసభల్లో తొక్సిసలాటలు జరిగిన కారణంగా బహిరంగసభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.
అయితే సీఎం జగన్ సభకు మాత్రం.. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా.. పించన్ అందుకుంటున్న వృద్ధులను వాలంటీర్ల సాయంతో తరలించారు. పెద్ద వయసు ఉన్న వారు ఇబ్బంది పడినా.. పట్టించుకోలేదు. తామే తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకు వస్తామని చెప్పి తీసుకెళ్లారు కానీ.. ఆ వృద్ధులు కొన్ని గంటల పాటు సభలో నిల్చుకోవడానికి .. కూర్చోవడానికి ఇబ్బందులు పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సీఎం రాక సందర్భంగా రాజమహేంద్ర వరంలో బారీకేడ్లు, పరదాలు ఏర్పాటు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా 70 ఏళ్ల వృద్ధ మహిళ తీవ్రంగా గాయడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించి చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.